ఏపీ క్రీడాభివృద్ధికి సహకరించండి..

ఏపీ క్రీడాభివృద్ధికి సహకరించండి..
ఢిల్లీలో శాప్ చైర్మన్ రవి నాయుడు క్రీడా ప్రాజెక్టులపై కీలక చర్చలు
ఖేల్లో ఇండియా జాయింట్ సెక్రటరీ వినీల్ కృష్ణతో భేటీ…
రాష్ట్రంలో 53 క్రీడా ప్రాజెక్టులకు రూ.1106 కోట్ల మంజూరు కోరుతూ విజ్ఞప్తి…
క్రీడా మౌలిక వసతులపై పలు ప్రతిపాదనలు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం శాప్ చైర్మన్ రవి నాయుడు ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించారు. ఖేల్లో ఇండియా కార్యక్రమానికి సంబంధించి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ జాయింట్ సెక్రటరీ వినీల్ కృష్ణా ను కలిసి రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సమర్పించారు.
ఈ సందర్భంగా తిరుపతిలోని దామినేడు ప్రాంతంలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో పాటు సాయ్ రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ స్థాయి క్రీడాకారులను తయారు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
53 క్రీడా ప్రాజెక్టులకు రూ.1106 కోట్లు అభ్యర్థన..

ఢిల్లీ పర్యటనలో ఉన్న శాప్ చైర్మన్ రవి నాయుడు కే లో ఇండియా ఉన్నతాధికారులను కలిసి ఖేల్లో ఇండియా ఇన్‌ఫ్రా ప్రోగ్రాం కింద రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను విస్తరించేందుకు మొత్తం 53 ప్రాజెక్టులకు రూ.1106 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్టులు అమలు అయితే రాష్ట్రంలో క్రీడా రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని పేర్కొన్నారు. సరే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో క్రీడా రంగానికి మరింత ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, కుప్పం, కర్నూల్, విజయవాడ, మచిలీపట్నం, అమలాపురం ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదించారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం…
ఏపీ క్రీడాభివృద్ధిలో భాగంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ అభివృద్ధి దృష్ట్యా అరకు వాలీలో 100 మైల్స్ అరకు వ్యాలీ ఇంటర్నేషనల్ ట్రైల్ నిర్వహణకు ప్రత్యేక ప్రతిపాదనను శాప్ చైర్మన్ రవి నాయుడు అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక, క్రీడా అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఎన్నో అవకాశాలు ఉన్న ప్రాంతాలలో ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను పూర్తిస్థాయిలో వివరించారు.
వాటర్ స్పోర్ట్స్ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదన..
రాష్ట్రంలోని పలు జలాశయాల వద్ద జిల్లా స్థాయి ఖేల్లో ఇండియా వాటర్ స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడు ఉన్నతాధికారులకు సూచించారు. మచిలీపట్నం నాగయ్యలంక, ఏలూరులోని ఎర్రకాలువ, తిరుపతిలోని రాయల్ చెరువు, ఎన్టీఆర్ జిల్లాలోని పున్నమిఘాట్, విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రతిపాదనలపై ఖేల్లో ఇండియా జాయింట్ సెక్రటరీ వినీల్ కృష్ణ సానుకూలంగా స్పందించినట్లు శాప్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో శాప్ ఎండీ భరణి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చెందితే గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
