చిన్నారుల ప్రాణం కోసం.. వికలాంగుడి మహా విరాళం

చిన్నారుల ప్రాణం కోసం.. వికలాంగుడి మహా విరాళం

పిల్లల వైద్యం కోసం రూ. 90 వేలు అందజేసిన విజయనగరం వాసి గోవింద

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తోటివారి కష్టం చూసి ఆ వికలాంగుడి మనసు ద్రవించింది. తాను శారీరకంగా వైకల్యంతో ఉన్నా, ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో సుదూర ప్రాంతం నుంచి వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకులబస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల పిల్లలు శివ సహస్ర (7), మహావీర్ (4) అరుదైన వెన్నుపూస వ్యాధి (ఎస్ఎంఏ)తో బాధపడుతున్నారు. వీరి ప్రాణాలు కాపాడాలంటే ఒక్కొక్కరికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు.

ఈ చిన్నారుల దీనస్థితి గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన మీసాల గోవింద అనే వికలాంగుడు చలించిపోయారు. తాను ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న రూ. 90వేల నగదును మంగళవారం బెల్లంపల్లికి వచ్చి బాధితుల తల్లిదండ్రులకు అందజేశారు. తనకంటే కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆయన ఆలోచనను పట్టణ ప్రజలు కొనియాడుతున్నారు.

“ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చిన ఒక వికలాంగుడు ఇంతటి ఉదారత చూపిస్తే.. మన బెల్లంపల్లి బిడ్డల కోసం మనమంతా ఎందుకు కదలకూడదు?” అని స్థానికులు చర్చించుకుంటున్నారు. దాతలు స్పందించి ఈ చిన్నారులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. గోవింద వెంట గొర్లె సిద్దు, ఉండ్రాళ్ళ మహేష్ ఉన్నారు.