పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

  • బుర్రి ప్రసాద్ డిమాండ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా 3వ మహాసభలు ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. బ్రహ్మయ్య, అశోక్ అధ్యక్షతన జరిగిన సభకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పైళ్ల ఆశయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చిందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్స్ అమలు ద్వారా కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతో పేదలపై తీవ్ర భారం పడుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామీణ కూలీలకు సరిపడా ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. పోడు భూములపై అటవీ శాఖ అధికారుల వేధింపులను నిలిపివేసి, సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేదలకు సాగుభూములు కేటాయించడంతో పాటు కూలీ రేట్లు పెంచాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, బీమా సౌకర్యాలు అర్హులందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో నాయకులు రాజమణి, రాజలింగు, లక్ష్మి, సరిత, చారి, శంకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమణ, జిల్లా కార్యదర్శి రంజిత్‌కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె. ప్రేమ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు పగిడి కిషన్, జిల్లా కార్యదర్శి సునార్కర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక
వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుమస అశోక్, కార్యదర్శిగా కనికరపు అశోక్, కోశాధికారిగా ముడిమడుగుల బ్రహ్మయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కృష్ణమాచారి, గుమస బాపు, ఎం. జయ, సహాయ కార్యదర్శులుగా వేల్పుల శంకర్, రాజమణి, నరేందర్, సరిత ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా జె. మల్లేష్, పి. స్వరూప, కె. సునీత, జి. రాజలింగు, కె. కేత, డి. లక్ష్మి, శామల, రాజన్న, అశోక్, స్వరూప తదితరులు ఎంపికయ్యారు.

Leave a Reply