కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన…

కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన…
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే జూలకంటి
మాచర్ల, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలను సైతం త్యజించిన త్యాగి దివంగత తోట చంద్రయ్య అని, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లుపై సాగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2021 లో మాచర్లలో టీడీపీ ఇంచార్జ్ గా తనను ప్రకటించగానే, జరిగిన భారీ ర్యాలీ చూసిన వైసీపీ రక్కసి మూకలు ప్రతి మండలంలో పార్టీ నాయకులను చంపేందుకు పథకం రచించాయన్నారు.
పిన్నెల్లి సోదరుల అనుచరులు ఒక పథకం ప్రకారం హత్య చేశారని, తోట చంద్రయ్య పీకపై కత్తిపెట్టినా, ఎక్కడ భయపడకుండా జై చంద్రబాబు అని ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. చంద్రయ్య మరణం బడుగు బలహీన వర్గాలను ఆలోచింపజేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారి కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుందన్నారు. కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళనకు దోహదపడుతోందని ఎమ్మెల్యే జూలకంటి అభిప్రాయపడ్డారు.
పల్నాడులో అనాదిగా నెలకొన్న ఫ్యాక్షన్ రూపుమాపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మార్గాలను అన్వేషిస్తున్నరన్నారు. తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడమే కాకుండా ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చి, ఫ్యాక్షన్ లో ఊభిలో పడకుండా కాపాడారని ప్రసంశించారు. పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లుకు అసెంబ్లీ, కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమన్నారు. ఈ బిల్లుతో ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకునేందుకు ఏ ఒక్కరూ మొగ్గు చూపరని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
