అదే.. కూటమి ప్రభుత్వ పతనానికి నాంది..

అదే.. కూటమి ప్రభుత్వ పతనానికి నాంది..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : దాడులు, విధ్వంసాలు కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకనున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో ఇటీవల టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఇలాంటి చర్యలు అనైతికం అన్నారు. గతంలో చంద్రబాబు పాలన చూశామని, ఇప్పుడు లోకేష్ నాయకత్వంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే దారుణంగా దాడులు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతిని ఎన్నడూ చూడలేదని, చంద్రబాబు దాడులకు ఎందుకు ఉసిగొల్పుతున్నారో? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో అర్ధం కావడం లేదన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించడం దారుణమన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ప్రజలు తెలివి కలిగిన వారని, అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ చర్యలను కూటమిలోని విజ్ఞత కలిగిన నాయకులే తప్పు పడుతున్నారని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వికృత రాజకీయ సాంస్కృతిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. వీరి చర్యలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన రాజకీయాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన అందించారని, ఏనాడు ఇలాంటి దాడులు, దుశ్చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ నేతలు ఆత్మాహుతి దళంగా పని చేస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వ చర్యలు వైసీపీ శ్రేణుల్లో తెగింపునిచ్చాయన్నారు. జోగి రమేష్ పై అక్రమ కేసులు బనాయించి జగన్ కు దూరం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అకృత్యాలకు ఒడిగట్టినా వైసీపీ శ్రేణులు ఆయనకు అండగా ఉంటారని చెప్పారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని భవిష్యత్ హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు ఉన్నారు.
