Rs.45 crore | 34 చెరువుల అనుసంధానం

Rs.45 crore | 34 చెరువుల అనుసంధానం
హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
ఎన్టీఆర్ జలాశయం నుంచి కృష్ణాపురం రిజర్వాయర్ వరకు చెరువుల అనుసంధానం
అవసరమైన ఏజెన్సీని గుర్తించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు
జీడి నెల్లూరు నియోజకవర్గ రైతులలో హర్షాతిరేకాలు
Rs.45 crore | చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ జలాశయం నుండి చెరువుల అనుసంధానానికి చివరకు కీలక మలుపు తిరిగింది. రూ.45 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ జలాశయం నుంచి కృష్ణాపురం రిజర్వాయర్ వరకు లింక్ కాలువ ద్వారా 34 చెరువులను అనుసంధానించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో జీడి నెల్లూరు నియోజకవర్గ రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్ సమర్పించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి రాత్రివేళ పరిశీలించి సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ జలాశయం నిండిన ప్రతిసారి మిగులు జలాలు వృథాగా సముద్రంలో కలుస్తుండగా, మరోవైపు పూతలపట్టు, గంగాధరనెల్లూరు ప్రాంతాల్లోని రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విరుద్ధ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, జలాశయంలో నిల్వ ఉండే మిగులు నీటిని చెరువులకు మళ్లించి వ్యవసాయానికి ఉపయోగించాలనే దూరదృష్టితో ఈ అనుసంధాన పథకాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

చిత్తూరు నగరానికి తాగునీటి అవసరాల కోసం 1997లో ప్రారంభమై 2004లో పూర్తైన ఎన్టీఆర్ జలాశయం, భీమా–బహుదా నదుల కలయిక ప్రాంతంలో నిర్మించబడింది. ఈ జలాశయం ప్రధానంగా తాగునీటి వనరుగా ఉన్నప్పటికీ, మిగులు జలాలను సమీప చెరువులకు తరలించి వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పట్లోనే చెరువుల అనుసంధాన ప్రణాళిక రూపొందించబడింది.

అయితే సంవత్సరాలుగా నిధుల కొరత, పరిపాలనా ఆలస్యం, ప్రభుత్వ మార్పులు వంటి కారణాలతో ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయింది. గతంలో కాలువ పనులను ప్యాకేజీలుగా విభజించి కొంత మేరకు పనులు చేపట్టినప్పటికీ, అవి గంగుపల్లె చెరువు వరకు మాత్రమే పరిమితమయ్యాయి. కీలకమైన మధ్య రీచ్ పనులు నిలిచిపోవడంతో మిగిలిన చెరువులకు నీరు చేరే వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఎన్టీఆర్ జలాశయం నిండిన సంవత్సరాల్లో వేలాది క్యూసెక్కుల నీరు ఉపయోగం లేకుండా వృథాగా పోవడం రైతుల్లో తీవ్ర ఆవేదన కలిగించింది.
ఈ పరిస్థితిని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్ రూ.45 కోట్లతో ఎన్టీఆర్ జలాశయం నుంచి కృష్ణాపురం రిజర్వాయర్ వరకు చెరువుల అనుసంధానానికి సమగ్ర ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించి, ప్రాజెక్టు అమలుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పనులను త్వరితగతిన పూర్తి చేయగల సమర్థవంతమైన ఏజెన్సీని గుర్తించి టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అనుసంధానం పూర్తయితే జీడి నెల్లూరు, పూతలపట్టు ప్రాంతాల పరిధిలోని 34 చెరువులు నిండే అవకాశం ఉంది. చెరువులు నిండడం వల్ల చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూమికి సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు ఇది భారీ ఊరటనిచ్చే ప్రాజెక్టుగా మారనుంది.
పంటల సాగుకు సరిపడా నీరు అందితే వరి, పప్పుధాన్యాలు, తోటపంటలు విస్తృతంగా సాగు చేసే అవకాశం ఉండటంతో దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెరువులు నిండడం ద్వారా పంటల కింద భూములు విస్తరించి, పంటల దిగుబడి మెరుగుపడటంతో రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. నీటి లభ్యత పెరగడంతో ఎండకాలంలో కూడా రెండో పంట వేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు పేర్కొంటున్నారు.
దీంతో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపిరి లభించనుందని వేపంజేరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కూడా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అరకొర నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకం పూర్తి కాలేదు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గంగాధర్ నెల్లూరు మండలంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ ఎంబి థామస్ తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం లభించడంతో జీడి నెల్లూరు నియోజకవర్గ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నిండితే బోర్లు, బావులు కూడా పునరుద్ధరించబడటంతో నీటి సమస్య శాశ్వతంగా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. గతంలో వృథాగా సముద్రంలో కలిసిపోయిన మిగులు జలాలు ఇకపై వ్యవసాయానికి ఉపయోగపడతాయని, రైతుల కష్టాలు తీరే దిశగా ఇది చారిత్రాత్మక నిర్ణయమని స్థానిక రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రభుత్వం త్వరితగతిన పనులు ప్రారంభించి నిర్దేశిత కాలంలో పూర్తి చేస్తే ఎన్టీఆర్ జలాశయం నీరు పూర్తిస్థాయిలో సద్వినియోగం కావడంతో పాటు 34 చెరువుల కింద ఉన్న భూములు పచ్చని పంటలతో కళకళలాడతాయని రైతులు ఆశిస్తున్నారు. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ అనుసంధాన పథకం కార్యరూపం దాల్చితే రైతుల కష్టాలు తీరడమే కాకుండా ప్రాంతీయ వ్యవసాయానికి శాశ్వత నీటి భద్రత కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
