రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన చిత్తూరు జిల్లా

రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన చిత్తూరు జిల్లా
- అధికారుల, ప్రజాప్రతినిధుల, డ్వాక్రా మహిళల సమిష్టి అన్న జిల్లా కలెక్టర్
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు ; గ్రామీణాభివృద్ధి, పరిశుభ్రత, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజల భాగస్వామ్య పాలన, స్వయం సమృద్ధి కార్యక్రమాల అమలులో చిత్తూరు జిల్లా దేశవ్యాప్తంగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను దక్కించుకొని రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.
కుప్పం మండలం, ఇరాల మండలం కాణిపాకం గ్రామపంచాయతీ, అలాగే జిల్లా పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రం సాధించిన ఈ ఘనతపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. అమరావతి నుంచి నిర్వహించిన దూరవాణి సమావేశంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, చిత్తూరు జిల్లా సాధించిన విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామీణాభివృద్ధి రంగంలో చిత్తూరు జిల్లా దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.
కుప్పం మండలానికి దేశవ్యాప్తంగా మూడో స్థానం
2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నానాజీ దేశ్‌ముఖ్ అత్యుత్తమ పంచాయత్ స్థిరాభివృద్ధి పురస్కారంలో చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని సాధించింది. ఈ పురస్కారం కింద రూ.1.5 కోట్ల నగదు బహుమతి లభించనుంది. కుప్పం మండలంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదల, హరితహారం, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామ సచివాలయాల సమర్థ నిర్వహణ, ప్రజా సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో విశేష పురోగతి సాధించడం వల్ల ఈ అవార్డు దక్కింది.
ప్రత్యేకంగా మహిళా సంఘాల భాగస్వామ్యంతో గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం, ప్రతి ఇంటికి తాగునీరు అందించే చర్యలు, వర్షపు నీటి సంరక్షణ, గ్రామస్థాయిలో డిజిటల్ సేవలను ప్రజలకు చేరవేయడం వంటి కార్యక్రమాలు కేంద్ర బృందాన్ని ఆకట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ సభల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెరగడం, గ్రామస్థాయి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే విధానం కూడా ఈ పురస్కారానికి కారణమైంది.
దేశంలోనే ప్రథమ స్థానంలో జిల్లా పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రం
2026 సంవత్సరానికి గాను పంచాయత్ సామర్థ్య వికాస అత్యుత్తమ సంస్థ పురస్కారం విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రం దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది. ఈ పురస్కారంతో పాటు రూ.1 కోటి నగదు బహుమతి లభించనుంది. గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, గ్రామస్థాయి సిబ్బందికి ఆధునిక పరిపాలన, డిజిటల్ సేవలు, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక నిర్వహణ, పన్నుల వసూళ్లు, పరిశుభ్రత నిర్వహణ, నీటి సంరక్షణ, ప్రజా ఆరోగ్య అంశాలపై విస్తృతంగా శిక్షణలు ఇవ్వడం వల్ల ఈ కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది.
ప్రత్యేకంగా గ్రామస్థాయి పరిపాలనలో సాంకేతికత వినియోగం, ఈ-పాలన వ్యవస్థ అమలు, గ్రామ పంచాయతీలకు స్వయం ఆదాయ వనరులు పెంచే విధానాలపై శిక్షణలు అందించడం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. పంచాయతీల పనితీరును మెరుగుపరిచే విధంగా రూపొందించిన శిక్షణ మాడ్యూళ్లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, క్షేత్రస్థాయి పర్యటనలు కేంద్ర బృందాన్ని ఆకట్టుకున్నట్లు సమాచారం. గ్రామీణ పాలనలో పారదర్శకత, ప్రజా బాధ్యత, ఆన్‌లైన్ సేవల అమలు వంటి అంశాల్లో చిత్తూరు జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
కాణిపాకం గ్రామపంచాయతీకి స్వయం సమృద్ధి పురస్కారం
2026 సంవత్సరానికి గాను స్వయం సమృద్ధి పంచాయత్ ప్రత్యేక పురస్కారం కింద చిత్తూరు జిల్లా ఇరాల మండలం కాణిపాకం గ్రామపంచాయతీ దేశవ్యాప్తంగా ద్వితీయ స్థానం సాధించింది. ఈ పురస్కారం కింద రూ.75 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాత కానిపాకం వినాయక స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందిన కాణిపాకం గ్రామపంచాయతీ పర్యాటకాభివృద్ధి, స్థానిక ఆదాయ వనరుల పెంపు, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సదుపాయాల కల్పనలో విశేష కృషి చేసింది.
ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, చెత్త నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలు మెరుగుపరచడం వంటి అంశాల్లో గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలాగే గ్రామపంచాయతీ స్వంత ఆదాయాన్ని పెంచుకునేందుకు పన్నుల వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించడం, స్థానిక వనరులను వినియోగించి ఆదాయం పెంపు కార్యక్రమాలు చేపట్టడం, మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రోత్సహించడం కూడా ఈ పురస్కారానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
రాష్ట్రానికి ఆదర్శంగా చిత్తూరు జిల్లా
ఒకే సమయంలో మూడు విభిన్న విభాగాల్లో జాతీయస్థాయి పురస్కారాలు సాధించడం ద్వారా చిత్తూరు జిల్లా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామీణాభివృద్ధి, పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్య పాలన, డిజిటల్ సేవలు, స్వయం సమృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో జిల్లా అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పురస్కారాలు జిల్లా ప్రజల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, మహిళా సంఘాలు కలిసి పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు కృషి అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పురస్కారాలు సాధించే దిశగా కృషి కొనసాగుతుందని తెలిపారు.
