విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు…

విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు…
- రెండేళ్లుగా డీఈవో, కలెక్టర్ చుట్టూ ప్రదక్షిణలు
- న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రెండేళ్లు గడిచినా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన విద్యా వాలంటీర్లకు వేతనాలు చెల్లించలేదని వారు ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2023–24 విద్యాసంవత్సరానికి డీఈవో ఆదేశాలతో జెడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో 32 మందిని విద్యా వాలంటీర్లుగా నియమించారని తెలిపారు.
ఎస్‌ఎస్‌సీ సిలబస్ పూర్తి చేయించేందుకు ఏడు నెలలు పనిచేసినా ఒక్కొక్కరికి రూ.80 వేల చొప్పున వేతనాలు అందలేదని వాపోయారు. మాజీ కలెక్టర్ భవేష్ మిశ్రా నిధులు మంజూరయ్యాయని చెప్పి హాజరు వివరాలు తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదన్నారు. డీఈవో కార్యాలయం బాధ్యత తప్పించుకుంటోందని ఆరోపించారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని వాలంటీర్లు కోరారు.
