February 21 | మన భాషను ప్రేమిద్దాం – భాషలన్నింటినీ గౌరవిద్దాం

February 21 | మన భాషను ప్రేమిద్దాం – భాషలన్నింటినీ గౌరవిద్దాం
February 21 | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా వెలుగు ఫౌండేషన్, తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలుగుతల్లి విగ్రహానికి శనివారం విశేష పూజలు జరిగాయి. ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు, వెలుగు ఫౌండేషన్ బాధ్యులు చందమామ బాబు, తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య బాధ్యులు మడమల రాంబాబు, అప్పినేడి పోతరాజు, కంచనపల్లి కృష్ణమోహనరావు,ఆర్ వి వి వసంతరావు, పుప్పాల సాంబ శివాజీ, ఎర్రపోతు నాగ వెంకట సురేష్ బాబు, అంబటిపూడి సుబ్రహ్మణ్యం, తదితరులు హాజరై మన మాతృభాషాభివృద్ధికి సమాలోచన చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో మేనేజర్ టి పెద్దిరాజు మాట్లాడుతూ… ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి, అన్ని భాషల పరిరక్షణ ద్వారా ప్రపంచం మరింత మైత్రియుతంగా మారుతుంది. మన మాతృభాషను ప్రేమిద్దాం – అన్ని భాషలనూ గౌరవిద్దాం పరిరక్షిద్దాం.. కాపాడుకుందాం.. అంటూ పిలుపునిచ్చారు. చందమామ బాబు మాట్లాడుతూ భాష ద్వారా మనం మన సంప్రదాయాలని నమ్మకాలని తరతరాలకు అందించగలం. మన భాషా సంపదను పెంపొందించేందుకు పుస్తకాలు చదవాలి కథలు కవితలు రచించాలి అన్నారు. తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సహాధ్యక్షులు మడమల రాంబాబు మాట్లాడుతూ పాఠశాలల్లో తెలుగు వెనకబడుతున్నదని తగిన చర్యలు తీసుకోవాలని, వివిధ ఉపాధ్యాయ సంఘాల వారు భాషాభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ప్రధానకార్యదర్శి అప్పినేడి పోతురాజు మాట్లాడుతూ 1952లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూని ఏకైక అధికారభాషగా ప్రకటించినప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు తమ మాతృభాష బంగ్లాకు గుర్తింపు ఇవ్వాలని నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఢాకా నగరంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల జ్ఞాపకార్థం 1999లో ఫిబ్రవరి 21ని ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మచిలీపట్నంలో అనేక సాంస్కృతిక సాహితీ సంస్థలు మన తెలుగు భాషకు చేస్తున్న సేవలను, కార్యక్రమాలను గురించి వివరించారు.
ఏపీటీఎఫ్ నాయకులు అంబటిపూడి సుబ్రమణ్యం మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో మాట్లాడే భాషలను సంరక్షించేందుకు ప్రభుత్వం, అనేక సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మాతృభాషతో పాటు ఇతర భాషలను నేర్చుకుని ప్రపంచంతో అనుసంధానం కావాలన్నారు. తెలుగు భాష సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి ఎర్రపోతు నాగ వెంకట సురేష్ బాబు మాట్లాడుతూ తెలుగు నాట వెలుగు ఫౌండేషన్, తెలుగు భాషా సాంస్కృతి సమాఖ్య, ఆంధ్ర సారస్వత సమితి, సాహితీ మిత్రులు లాంటి సంస్థలు సాహితీ సాంస్కృతిక సేవా రంగాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మాతృభాష వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగు ఫౌండేషన్ సభ్యులు కంచనపల్లి కృష్ణమోహనరావు, రేపల్లె వెంకట వీర వసంతరావు, తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కార్యవర్గ సభ్యులు పుప్పాల సాంబ శివాజీ తదితరులు హాజరై అందరికీ ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
