Huzur Nagar | అక్రమ కేటాయింపును తక్షణమే నిలిపివేయాలి..

Huzur Nagar | అక్రమ కేటాయింపును తక్షణమే నిలిపివేయాలి..
Huzur Nagar, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ ఉస్మానియా మసీదు కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్- 5 ను నిబంధనలకు విరుద్ధంగా, రహస్యంగా కేటాయించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తక్షణమే ఆపాలని మాజీ మసీదు కమిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో మసీదు కాంప్లెక్స్ లో షాప్ నెం.5 ను లీజ్ తీసుకున్న వ్యక్తి అనారోగ్య కారణాలతో కాలీ చేయడంతో వక్ఫ్ బోర్డు అధికారులు సీల్ వేశారు. కానీ, ఇప్పుడు ఎటువంటి బహిరంగ ప్రకటన లేకుండా, ఒక పంచాయతీ సెక్రటరీ సోదరుడైన ‘సోహైల్’ అనే వ్యక్తికి ఏకపక్షంగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఈ షాపు కేటాయింపు వెనుక సుమారు రూ. 4 నుండి 5 లక్షల వరకు చేతులు మారినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయని, పేదలకు దక్కాల్సిన ఉపాధిని డబ్బున్న వారికి అమ్ముకోవడం అన్యాయన్నారు. గతంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి హయాంలో, ఎంఐఎం జోక్యం వల్ల మసీదు కాంప్లెక్స్ వద్ద గొడవలు, ధర్నాలు జరిగాయి. ఇప్పుడు రంజాన్ సమయంలో అధికారులు దౌర్జన్యంగా సీల్ తీసి షాపును అప్పగిస్తే, స్థానిక ముస్లిం యువతలో ఆవేశం పెరిగి మళ్ళీ ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఈ విషయంలో వెంటనే స్పందిించి వక్ఫ్ బోర్డు సీఈఓ, చైర్మన్, స్థానిక తహసీల్దార్ లను ఆదేశించి ఈ ప్రక్రియను రంజాన్ పూర్తయ్యే వరకు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రంజాన్ పండుగ ప్రశాంతంగా ముగిసిన తర్వాత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించాలి. అనంతరం లక్కీ డ్రా పద్ధతిలో షాపు ను కేటాయించాలని ఈ పద్ధతి ద్వారా నిజమైన అర్హులైన పేదలకు లేదా చిన్న వ్యాపారులకు దక్కుతుంది. మేము స్వయంగా విరాళాలు సేకరించి, వక్ఫ్ బోర్డు నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా సొంత నిధులతో ఈ కాంప్లెక్స్ నిర్మించాం. అటువంటి ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. దయచేసి అధికారులు సహకరించి రంజాన్ పవిత్రతను, పట్టణ శాంతిని కాపాడాలని కోరుతున్నామన్నారు.
