neela rajamma, gattayya l 30 ఏళ్ల రాజకీయ అనుబంధానికి ఫలితం..

neela rajamma, gattayya l 30 ఏళ్ల రాజకీయ అనుబంధానికి ఫలితం..
- రైతు కుటుంబం నుంచి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పీఠం వరకు..
- నీల గట్టయ్య కుటుంబానికి దక్కిన గౌరవం..
- ఎమ్మెల్యే ఆశీస్సులతో తొలి పాలకవర్గంలోకి రాజమ్మ..
Kadiyam srihari, స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : ఘన్‌పూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్‌పర్సన్ పదవి చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రైతు కుటుంబానికి చెందిన నీల రాజమ్మ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రాజమ్మ గృహిణిగా, మహిళా రైతుగా సాధారణ జీవితం గడుపుతూ ప్రజా సేవలో అడుగుపెట్టారు. మొత్తానికి మున్సిపల్ తొలి పాలకవర్గంలో భాగమవ్వడం ఆమెకు, ఆమె కుటుంబానికి కీలక ఘట్టంగా నిలిచింది.
గత మూడు దశాబ్దాలుగా రాజమ్మ భర్త నీల గట్టయ్య రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన కడియం శ్రీహరికు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. టీడీపీ కాలం నుంచి బీఆర్ఎస్ దశ వరకు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ ఎమ్మెల్యే వెంటనే కొనసాగుతూ విశ్వసనీయ అనుచరుడిగా నిలిచారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా కూడా సామాజికంగా తన ముద్ర వేశారు. అయితే.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఈసారి మున్సిపాలిటీలో 11వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎమ్మెల్యే ఆశీస్సులతో నీల రాజమ్మను కాంగ్రెస్ తరఫున బరిలోకి దించారు. ప్రజల మద్దతుతో ఆమె విజయం సాధించి వైస్ చైర్‌పర్సన్ పదవిని అధిరోహించారు.
-ఎట్టకేలకు బీసీ వర్గానికే వైస్ చైర్ పర్సన్ పదవి:
మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించబడగా, వైస్ చైర్‌పర్సన్ పదవి ఎట్టకేలకు బీసీ వర్గానికే అవకాశం ఏర్పడింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నీల రాజమ్మకు అవకాశం కల్పించడం స్థానిక సమీకరణాల్లో కీలక మలుపుగా మారింది. దీంతో నీల గట్టయ్య 30 ఏళ్ల రాజకీయ ప్రయాణానికి గుర్తింపొచ్చినట్లైంది.
-ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను: వైస్ చైర్‌పర్సన్ నీల రాజమ్మ గట్టయ్య
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నేను మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నా భర్త 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా సరైన అవకాశాలు రాలేదు. నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సూచనలతో చైర్‌పర్సన్, కౌన్సిలర్ల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాను.
