Chittoor | తొలి దళిత ముఖ్యమంత్రి..దామోదరం సంజీవయ్య

Chittoor | ఏ ఆర్ డి.ఎస్.పి. నివాళులు..

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, మహానేత దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏ.ఆర్. డి.ఎస్‌పీ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డి.ఎస్‌పీ చిన్నికృష్ణ మాట్లాడుతూ 38 ఏళ్ల చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మహానేత దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, పేదల సంక్షేమం ఆయన పాలనకు మూలస్తంభాలని తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేపట్టిన చర్యలు దేశ రాజకీయాల్లో చిరస్మరణీయమని కొనియాడారు.

Chittoor

విద్య, ఉపాధి, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సంజీవయ్య గారు తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు నేటికీ ఆదర్శప్రాయంగా నిలిచాయని డి.ఎస్‌పీ తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కృషి, పట్టుదలతో పనిచేస్తే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన జీవితం స్పష్టంగా నిరూపిస్తుందని పేర్కొన్నారు. అలాగే పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంజీవయ్య సేవా భావనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు న్యాయం, భద్రత అందించడంలో మరింత అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసేవే ప్రధాన ధ్యేయంగా భావించి విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఐ. చంద్రశేఖర్‌తో పాటు ఏ.ఆర్ సిబ్బంది పాల్గొని మహానేత దామోదరం సంజీవయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

Chittoor

Leave a Reply