cricket|జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ

cricket|జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ
- జింబాబ్వే దెబ్బ.. ఆసీస్ అబ్బా
- టీ20 వరల్డ్‌కప్‌లో మరో సంచలనం
- ఆస్ట్రేలియా జట్టును ఓడించిన జింబాబ్వే
- 23 పరుగుల తేడాతో ఘన విజయం
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పొట్టి ఫార్మట్‌లో సంచలనాలు నమోదుకావడం కొత్తేమి కాదు. పెద్ద జట్లకు చిన్న జట్లు షాకిస్తుంటాయి. టీ20 క్రికెట్లో ఏ మ్యాచ్‌ను ఎవరు గెలుస్తారో అంచనా వేయడం సులువు కాదు. ఈ ఫార్మట్‌లో పసికూన కూడా విజయం సాధించవచ్చని అనేక మ్యాచుల్లో రుజువైంది. తాజాగా టీ-20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదు అయింది. ఆస్ట్రేలియా పై జింబాబ్వే జట్టు 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా చతికిలపడింది. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్షా 65 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31) మంచి భాగస్వామ్యం అందించాడు. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బ్రాడ్ ఇవాన్స్ మూడు, మసకద్జ, బర్ల్ చెరో వికెట్ తీశారు. మొదటి ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత మాట్ రెన్షా, మ్యాక్స్‌వెల్ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం లేకుంటే ఆస్ట్రేలియా మరింత అవమానకరంగా ఓడిపోయి ఉండేది.
19ఏళ్ల తర్వాత..
అయితే 2007లో జరిగిన టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో సైతం జింబాబ్వే విజయం సాధించింది. సరిగ్గా 19 ఏళ్ల తరువాత సేమ్ సీన్ రిపీట్ చేయడం విశేషం. ఈ గెలుపుతో జింబాబ్వే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోగా, ఆస్ట్రేలియా తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్ కోసం సిద్ధమవుతుండగా, జింబాబ్వే ఇదే జోష్‌ను కొనసాగించాలని భావిస్తోంది.
ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గాయం
మరోవైపు, ఆస్ట్రేలియాకు ఈ ఓటమి కంటే.. ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గాయం ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్ చేస్తూ బొటనవేలికి గాయం కావడంతో స్టోయినిస్ మైదానం వీడాల్సి వచ్చింది. తదుపరి మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఆసీస్ టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సెమీస్ రేసులో నిలవాలంటే ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంటుంది.
