4 people | అవి పాలు కావా?

4 people | అవి పాలు కావా?

4 people | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కుప్పం నియోజకవర్గంలో కల్తీ పాలు తయారీ, విక్రయాలపై సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాలు, కొన్ని న్యూస్ ఛానళ్లలో ప్రచారం అవుతున్న వార్తలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ఈ ప్రచారం మరింత వేగంగా వ్యాపించి, ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడిన వాస్తవాలు ఈ ప్రచారాలకు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.

కుప్పం ప్రాంతంలో ఎక్కడా కల్తీ పాలు తయారీ లేదా విక్రయాలు జరగలేదని స్పష్టంగా చిత్తూరు జిల్లా పోలీసులు చెపుతున్నారు. అయితే కర్ణాటక పోలీసులు మాత్రం కుప్పం నియోజకవర్గంలోనే నకిలీ పాలను తయారుచేసి కర్ణాటక రాష్ట్రంలో విక్రయిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన పోలీస్ తమ రాష్ట్రంలో నకిలీ పాలు ఉత్పత్తి కావడం లేదని బుఖాయిస్తున్నారు. నకిలీ పాల ఉత్పత్తి తమ రాష్ట్రంలో జరగలేదంటే తమ రాష్ట్రంలో జరగలేదని పరస్పరం చెబుతున్నారు.

4 people |

చిత్తూరు జిల్లా పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారంతో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా పరిధిలోని కే జి ఎఫ్ అండర్సన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బల్లగిరి గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించగా, కల్తీ పాలు తయారీ ముఠా గుట్టు రట్టు అయింది. లోకేష్ అనే వ్యక్తి ఫామ్ హౌస్‌ను లీజుకు తీసుకుని, వెంకటేష్, అతని కుమారుడు బాలాజీ కలిసి కర్ణాటక ప్రభుత్వ మిల్క్ పౌడర్, బయట మార్కెట్‌లో లభించే మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్ ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ దాడుల్లో వెంకటేష్, బాలాజీతో పాటు దిలీప్ (గుడిపల్లి మండలం), బాలరాజు (రామకుప్పం మండలం), కర్ణాటకకు చెందిన మనోహర్‌ను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.

4 people |

విచారణలో ముద్దాయిల కన్‌ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ వ్యవహారం అంతర్రాష్ట్ర స్థాయిలో నడుస్తున్న ముఠా కుట్రగా బయటపడింది. ట్రాన్స్‌పోర్టర్లుగా మనోజ్ కుమార్, బంగారు తిరుపతి, మంజునాథ్ (బిటుకూరు, కర్ణాటక), కార్తీ (పారండ్లహళ్లి, కర్ణాటక)లను గుర్తించారు. అలాగే మిల్క్ పౌడర్ సరఫరాదారులుగా హర్షబ్ ఖాన్ (చింతామణి, కర్ణాటక), అతనికి సరఫరా చేసిన రాజారెడ్డిని అరెస్టు చేశారు. ఈ ముఠా వ్యవహారంలో సదాశివ (శాంతపల్లి, కాణిపాకం), బంగారు తిరుపతి (గుట్టపల్లి, బేతమంగళం) కల్తీ పాలు అని తెలిసినా కొనుగోలు చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని కూడా ముద్దాయిలుగా చేర్చి రిమాండ్‌కు తరలించారు.

అలాగే ఫీల్డ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న విజయ్ కుమార్ (వి. రామాపురం, గంగవరం మండలం), మంజునాథ్ (బాలింద్రపల్లి, వీకోట మండలం, కర్ణాటక) తక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి వాటిని వి.కోట సెంటర్‌లోని శ్రీకృష్ణ డైరీ మిల్క్ ఫుడ్స్‌కు సరఫరా చేసినట్లు విచారణలో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రాథమిక విచారణలో శాంతిపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, గుడిపల్లి, రామకుప్పం మండలాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కలిపి మొత్తం నలుగురు ఈ వ్యవహారంలో కీలకంగా పాల్గొన్నట్లు గుర్తించారు.

అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ కల్తీ పాలు పూర్తిగా కర్ణాటక రాష్ట్ర పరిమితుల్లోనే తయారు చేయబడి, కర్ణాటక పరిధిలోని డైరీలకు మాత్రమే సరఫరా చేసినట్లు విచారణలో స్పష్టమైంది. కుప్పం నియోజకవర్గంలోని ఏ డైరీకీ కల్తీ పాలు సరఫరా కాలేదని అధికారులు స్పష్టంగా వెల్లడించారు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో “కుప్పంలో కల్తీ పాలు తయారీ” అంటూ ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని పోలీసులు తెలిపారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించగా, కల్తీ పాలు వ్యవహారం వెలుగులోకి రావడంతో చిత్తూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలు తాము తాగుతున్న పాలు సురక్షితమా కాదా అన్న ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్న భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొంతమంది నిందితులు కాలం చెల్లిన పాలపౌడర్, పామ్ ఆయిల్, చక్కెర, ఇతర పదార్థాలను ఉపయోగించి కృత్రిమంగా పాల మాదిరిగా కనిపించే ద్రవాన్ని తయారు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కల్తీ పాలు ఆరోగ్యానికి తీవ్ర హానికరం. యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ వంటి హానికర పదార్థాలు కలిపిన పాలు తాగితే జీర్ణ సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలు, పిల్లల్లో పోషకాహార లోపం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద పాలను కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు. పాలు మరిగించి చల్లారిన తర్వాత అయోడిన్ చుక్కలు వేసినప్పుడు నీలం రంగు మారితే స్టార్చ్ కలిసినట్లు భావించవచ్చు. అలాగే పాలు, నీటిని కలిపి బలంగా షేక్ చేసినప్పుడు అధిక నురుగు వస్తే డిటర్జెంట్ కలిసినట్లు అనుమానించాలి అని ఆహార భద్రత నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కొన్ని వర్గాలు స్థానిక రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తుండగా, అధికారులు మాత్రం విచారణ కొనసాగుతోందని, ఎవరైనా దోషులైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసత్య ప్రచారం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.

మొత్తానికి కర్ణాటక రాష్ట్రంలో కల్తీ పాలు తయారు చేసి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు సమన్వయంతో బయటపెట్టడం కీలక పరిణామంగా మారింది. అయితే కుప్పం నియోజకవర్గంలో కల్తీ పాలు తయారీ లేదా విక్రయాలు జరిగాయని ప్రచారం అవుతున్న వార్తలు అసత్యమని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం సమాజంలో అనవసర భయాందోళనలు సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేసి నకిలీపాలు ఎక్కడ తయారవుతున్నాయో నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉంది.

click here to read more : Lucky draw | విజయం ఎవరిని వరించిందంటే..

click here to read more

Leave a Reply