Audio | రహస్య టెలికాన్ఫరెన్స్ కలకలం..

Audio | రహస్య టెలికాన్ఫరెన్స్ కలకలం..

మంత్రి, ఉద్యోగ సంఘాల నేతలపై బీజేపీ ఫిర్యాదు
ఆడియో సాక్ష్యాలతో కలెక్టర్‌ను కలిసి వినతి – సస్పెన్షన్, క్రిమినల్ కేసుల డిమాండ్

Audio | ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: లీకైన ఆడియో వ్యవహారం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఆడియో సాక్ష్యాలను అధికారులకు సమర్పించి తక్షణ విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో రహస్యంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై చర్చించడం అత్యంత ఆందోళనకరమన్నారు దేవకీ వాసుదేవరావు. ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులు రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని వ్యాఖ్యానించారు.

లీకైన ఆడియోలో ఉద్యోగ సంఘాల నేతలు ‘100% పోలింగ్ వేయిస్తాం’, ‘బంగారు పళ్లెంలో పెట్టి గెలిపిస్తాం’ వంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బహిరంగంగా ధిక్కరించినట్లేనని ఆయన అన్నారు. వార్డుల వారీగా ఉద్యోగుల వివరాలను చదివి వినిపించడం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించిన అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం మరియు ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఉద్యోగ సంఘాల నేతలను సర్వీసు నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంగల సత్యనారాయణ, నున్నా రవి, గుత్తా వెంకటేశ్వరరావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, వీరెల్లి రాజేష్, రవి రాథోడ్, అల్లిక అంజయ్య, దొడ్డ అరుణ, రవి గౌడ్, కొణతం లక్ష్మీనారాయణ, బోయినపల్లి సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply