Roads l కాస్త బాగు చేయించండి మహాప్రభో..

Roads l కాస్త బాగు చేయించండి మహాప్రభో..

తిరువూరు నియోజకవర్గంలో అధ్వాన్నంగా రహదారులు…
రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యేకు ప్రజల ఫిర్యాదు..
సీఎం, మంత్రిని కలిసి నిధులు మంజూరు కు కృషి..
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Roads l తిరువూరు, ఆంధ్రప్రభ: తిరువూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ని కలిసి వినతిపత్రం సమర్పించారు. గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామ ప్రజలు తిరువూరులోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, నిత్యజీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. ఆర్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ గొల్లమందల వెంకటేశ్వర్లు భావోద్వేగంతో ఎమ్మెల్యే కాళ్లపై పడి తమ గ్రామ రోడ్ల దుస్థితిని వివరిస్తూ, వర్షాకాలంలో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచి ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొందన్నారు. గత 22 సంవత్సరాలుగా రోడ్ల సమస్య పరిష్కారం కాలేదని, ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లెపోగు రమేష్ కూడా ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

ప్రమాదాలకు కారణమవుతున్న రహదారులు…

నియోజకవర్గంలో చాలా ప్రాంతాలలో రహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిని ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన ఇటీవల మూడు రోజుల పర్యటనలో 35 గ్రామాలను సందర్శించిన సందర్భంగా పలుచోట్ల రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. ముఖ్యంగా లక్ష్మీపురం–రాయుగూడెం మెయిన్ రోడ్డు,రాయుగూడెం–కోకిలంపాడు లింక్ రోడ్డు,కోకిలంపాడు–తిరువూరు మెయిన్ రోడ్డు,పీటీ కొత్తూరు–చింతలపాడు,చింతలపాడు–కొమ్మిరెడ్డిపల్లి,వావిలాల–ఊటుకూరు, సత్యాలపాడు–ఊటుకూరు, ఏ కొండూరు అడ్డ రోడ్డు–విస్సన్నపేట మార్గాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ మార్గాల్లో రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామ నాయకులు తెలిపారు. నియోజకవర్గంలోని రాయుగూడెం (లక్ష్మీపురం) గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు ఆసుపత్రికి వెళ్లాలంటే కూడా రోడ్ల దుస్థితి కారణంగా ఒక్క ఆటో కూడా గ్రామానికి రావడం లేదని ఎమ్మెల్యేకు విన్నవించారు. అత్యవసర సమయంలో రవాణా లేక ప్రాణాపాయం ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిధులు మంజూరు చేయిస్తాం..

నియోజకవర్గ ప్రజల వేదన విని చలించిపోయిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని కలిసి తిరువూరు నియోజకవర్గంలోని పెండింగ్ రోడ్ల పరిస్థితిని వివరించి, భారీగా నిధులు మంజూరు చేయాలని కోరతానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ సహకారంతో అన్ని గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులే ప్రాణమని, రోడ్లు బాగుంటేనే విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం అన్నీ ముందుకు సాగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply