TG | బంపర్ ఆఫర్‌తో..!

TG | బంపర్ ఆఫర్‌తో..!
- ఆడబిడ్డ పెండ్లికి రూ.25వేలు, బిడ్డ పుడితే రూ.16 వేలు
- వినూత్న హామీలతో సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్
- ప్రచారంలో దూసుకుపోతున్న 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి…
TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలతో ముందుకు వస్తున్నాయి. అయితే సంగారెడ్డి పట్టణంలో ఒక అభ్యర్థి ప్రకటించిన వినూత్న హామీలు ప్రస్తుతం పట్టణమంతా చర్చనీయాంశంగా మారాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా కొత్తపల్లి శ్రీకాంత్ (నాని) పోటీ చేస్తున్నారు. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన ఆయన, మరోసారి తనను గెలిపిస్తే అమలు చేసే హామీలను వివరంగా పొందుపరిచిన కరపత్రాన్ని విడుదల చేశారు.
తనను గెలిపిస్తే 16వ వార్డులో ఎవరి ఇంట్లోనైనా అడబిడ్డ పెళ్లి జరిగితే ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ఆడబిడ్డ పుడితే రూ.16 వేలు, ఏదైనా కారణాలతో మరణం సంభవిస్తే అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.10 వేలు అందిస్తానని ప్రకటించారు. ఇదే కాకుండా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ఇంకా మంజూరు కాని వారికి ప్రతి నెల రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ వినూత్న హామీలతో కూడిన కరపత్రం వార్డుతో పాటు పట్టణమంతా విస్తృతంగా ప్రచారం కావడంతో, స్థానికులు వీటి అమలుపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి హామీలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
