Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 3 గురు మృతి..

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 3 గురు మృతి..
Road Accident, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నెల్లూరు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున టైర్ పేలడంతో బస్సు అదుపు తప్పింది. డివైడర్ దాటి అవతల వైపుకు వెళ్లి కంటైనర్ లారీని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి పైగా తీవ్ర గాయాలు అవ్వడంతో 108 అంబులెన్స్ లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
36 మంది ప్రాణాలను కాపాడిన డీసీఎం డ్రైవర్…
నంద్యాల జిల్లా గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కంటైనర్ పూర్తిగా కాలిపోయాయి. బస్సులోను మంటలు చెల్లరేగిన సమయంలో ఆ దారిలో వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వెంటనే స్పందించారు. అప్పటికే డోరు లాక్ అయిపోయాయి. ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ డిసిఎం డ్రైవర్ వెంటనే బస్సు అద్దాలని పగలగొట్టి లోపల ఉన్న సుమారు 36 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ బయటపడ్డారు. దీని వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. గత ఏడాది కర్నూలు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరువకముందే ఈ సంఘటన జరిగింది. ప్రవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి జిల్లా ఎస్పీ సునీల్ షేరన్ చేరుకొని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంపై ఆరా తీసిన మంత్రులు ఎమ్మెల్యేలు…
బస్సు టైర్ పేలి అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ మరణించడం దురదృష్టకరం అని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ లు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు అదృష్టవశాత్తు బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.


