Singareni కార్మికులకు గుడ్‌న్యూస్..

Singareni కార్మికులకు గుడ్‌న్యూస్..

  • త్వరలో మెడికల్ బోర్డు పునఃప్రారంభం!
  • అర్హులకే ప్రయోజనం.. పారదర్శకంగా ప్రక్రియ నిర్వహణ
  • కారుణ్య నియామకాలపై ప్రభుత్వ దృష్టి
  • అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు
  • కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: భట్టి

ఆంధ్రప్రభ : సింగరేణి (Singareni ) కార్మికులకు శుభవార్త. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత శాసన సభ్యులు, మంత్రులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ అంశంపై కార్మికుల ఆందోళనలను వివరించారని చెప్పారు. ఆ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.

కార్మికుల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, మెడికల్ బోర్డు ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంచి యాజమాన్యానికి సహకరించాలని కార్మికులకు సూచించారు.

ఇటీవల కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం (ఈ నెల 13వ తేదీ) జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తెలియజేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.

సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశం తమ దృష్టిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ అంశంపై న్యాయ పరమైన సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిబంధనల మేరకు న్యాయ సలహా ప్రకారం సానుకూలంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Singareni

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ సింగరేణి…

అలాగే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన త‌ర్వాత సింగ‌రేణిలో 2,657 పోస్టులను భ‌ర్తీ చేశామన్నారు. వీటిలో 555 ఎక్సటర్నల్ పోస్టులు ఉండ‌గా… 2,102 కారుణ్య నియామ‌క ఉద్యోగాల‌ను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యక్ష ఉద్యోగాల భర్తీని కూడా ఆన్లైన్ పద్ధతిలో చేపట్టి వివాద రహితంగా అర్హులందరికీ ఉద్యోగాలు కల్పించామన్నారు.

కారుణ్య నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచడం ద్వారా మరింత మంది అర్హులకు అవకాశం కల్పించామని తెలిపారు. ఇప్పటికే 200 మంది లబ్ధి పొందారని వెల్లడించారు.

దేశంలోనే తొలిసారిగా సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించేలా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. ఇదే కాకుండా బ్యాంకులతో సంప్రదింపులు జరిపి ఇటీవలే సింగరేణి ఉద్యోగుల కోసం రూ.10 లక్షల ఉచిత సహజ బీమా సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు కూడా 40 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించామన్నారు.

ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా కార్మికులకు లాభాల వాటాను చెల్లించామని తెలియజేశారు. గత రెండేళ్లలో రూ.1500 కోట్లను లాభాల వాటా రూపేనా చెల్లించినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ను చెల్లిస్తున్నామని, 2023-24లో ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున, 2024-25లో రూ.5,500 చొప్పున లాభాల బోనస్ను పంపిణీ చేసినట్లు తెలిపారు.

సింగరేణిలో ప్రతీ ఉద్యోగికి అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో అన్ని ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ చేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా గోదావరిఖని లో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, డిపెండెంట్ పిల్లల వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.

తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా సింగరేణి కార్మికుల కష్టాలు, సమస్యలను ప్రత్యక్షంగా చూసినట్లు పేర్కొన్నారు. అందువల్ల సింగరేణి కార్మికుల పట్ల తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత మరియు వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

రాబోయే రోజుల్లో కూడా సింగరేణిని బహుముఖంగా విస్తరించేందుకు, కొత్త బొగ్గు బ్లాక్లు సాధించేందుకు తద్వారా ఉద్యోగుల వారసులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతాయన్నారు. ఒడిశా నైనీ బ్లాక్ అనుమతులతోపాటు బొగ్గు ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వంలో తీసుకున్న ప్రత్యేక చొరవను గుర్తుచేశారు.

రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణిని విస్తరించే దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే పోటీ మార్కెట్లో సింగరేణి నిల దొక్కుకోవాలంటే ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాలని, ఇందుకోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

TG | సైబర్ నేరాల ఛేదనకు సాంకేతిక అస్త్రం..

Leave a Reply