85peopledied | ఎండ.. ప్రచండం
85peopledied | ఎండ.. ప్రచండం
85peopledied | తెలంగాణలో నిప్పుల కుంపటి
వడదెబ్బకు పోతున్న ప్రాణాలు
రాష్ట్రంలో ఇప్పటికే 85 మంది మృతి
రాష్ట్ర వ్యాప్తంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం: పొంగులేటి
85peopledied | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భానుడి ప్రతాపంతో తెలంగాణ భగ్గుమంటోంది.. మునుపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వడగాల్పులకు శుక్రవారం 34 మంది ప్రాణాలు కోల్లోగా, రెండో రోజైన శనివారం కూడా భానుడి తీవ్రతకు 51 కిపైగానే మరణాలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో వృద్ధులు, కూలీలే ఎక్కువగా ఉన్నారు. గత రెండు రోజులు నుంచి సూర్యుడు విశ్వరూపం చూపుతున్నాడు. రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉష్ణతాపంలో ప్రజలు అల్లాడి పోతున్నారు. శనివారం నాడు ఆసిఫాబాద్ జిల్లాలో కుంచవెళ్లి, కాగజ్‌నగర్‌లో 46.4, జగిత్యాల జిల్లా ధర్మపురి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 46.3, ఖమ్మం రూరల్, అదే జిల్లా వైరా, మంచిర్యాల జిల్లా తాండూర్‌లో 46.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది.
వరంగల్ అత్యధిక మరణాలు
వడదెబ్బతో గత 24 గంటలలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదబ్బకు గురై 51 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 మంది మరణించారు. ఉమ్మడి కరీంనగర్‌లో 11, ఖమ్మంలో 7, ఆదిలాబాద్‌లో ఐదుగురు, నల్గొండలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వడగాల్పులకు మరణించిన వారి సంఖ్య 85కి చేరింది.
మూగ జీవాలు సైతం..
ఎండ వేడితో మూగజీవాలు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. మహబూబాబాద్‌లోని నీటి పారుదలశాఖ కార్యాలయంలో చింత చెట్టుపై ఉండే వందలాది గబ్బిలాలు ఒక్కసారిగా మృత్యువాత పడ్డాయి. మునిసిపల్ సిబ్బంది అక్కడకు చేరుకొని వాటిని దూరంగా తరలించి జేసీబీ సాయంతో సాయంతో గోతిని తీసి అందులో పూడ్చి ఖననం చేశారు.
వడగాలులు.. అక్కడక్కడ వానలు!
వచ్చే మూడు రోజుల పాటు ఐదారు జిల్లాలను మినహాయిస్తే.. అన్నిచోట్లా 40-42 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆది, సోమవారాల్లో కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాలు వీస్తాయని పేర్కొంది. అలాగే ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఎండల తీవ్రతపై మంత్రి పొంగులేటి సమీక్ష
ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న మూడు రోజులు వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. అత్యవసర వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
