గని కార్మికుడి తనయుడి ఘనత..
- సింగరేణి కార్మికుడి తనయుడు డీఎస్పీ
- గ్రూప్-1లో సత్తా చాటిన ప్రవీణ్ కుమార్
- కన్వేయర్ ఆపరేటర్ కుమారుడి గర్వించదగ్గ ఘనత
మందమర్రి, ఆంధ్రప్రభ : కష్టపడి చదివితే సాధారణ కుటుంబం నుంచి కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించారు సింగరేణి కార్మికుడి కుమారుడు డి. ప్రవీణ్ కుమార్. గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. పెద్దపల్లిలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
సింగరేణి కాలరీస్ మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో కన్వేయర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న డి. రవీందర్ కుమారుడు ప్రవీణ్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా బుధవారం మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో ప్రవీణ్ కుమార్‌తో పాటు ఆయన తండ్రి రవీందర్‌ను ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఒక సాధారణ సింగరేణి కార్మికుడు తన కుమారుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రవీణ్ కుమార్ భవిష్యత్తులో తన వృత్తిలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
సింగరేణి కార్మికులు గనుల్లో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. అదే సమయంలో పిల్లల చదువు, భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించి వారికి పటిష్టమైన పునాదులు వేయాలని రాధాకృష్ణ కోరారు.
