460 Sarpanch Posts | రిజర్వేన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం
460 Sarpanch Posts | రిజర్వేన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం
460 Sarpanch Posts | అచ్చంపేట, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు అచ్చంపేట ప్రెస్ క్లబ్(Press Club)లో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీసీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారామోని నరేష్ యాదవ్(Dr. Naramoni Naresh Yadav) నేతృత్వంలో బీసీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 460 సర్పంచ్ స్థానాలు(460 Sarpanch Posts) ఉండగా, ఎస్టీలకు133 స్థానాలు, ఎస్సీలకు 85 స్థానాలు, అన్రిజర్వ్డ్ కింద 181 కేటాయిస్తూ, ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రకారం 150 పైగా స్థానాలు బీసీలకు కేటాయించాల్సి వుండగా కేవలం 61 స్థానాలు మాత్రమే కేటాయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం 23 శాతానికనుగుణంగానైనా 101 స్థానాలు కేటాయించాల్సి వుందని, ఏ ప్రాతిపాదికన బీసీలకు ఇంత తక్కువ రిజర్వేషన్లు కేటాయించారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒకవైపు 42% రిజర్వేషన్లు(42% Reservation) ఇస్తామని చెబుతూ, మరోవైపు ఇంత తక్కువ రిజర్వేషన్లు కేటాయించడం బీసీలను నిరుత్సాహపరుస్తుందని, దీనిపై వెంటనే సవరణలు చేయాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండల పరిధిలో ఉన్న కుమ్మరోన్పల్లి, వంగురోని పల్లి, కల్మలోనిపల్లి, ప్రశాంత్ నగర్, తిరుమలపూర్ గ్రామాల్లో ఎస్టీ జనాభా లేకపోయినా ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణాంకాల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అని వారు డిమాండ్ చేశారు.
కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం..
ఇదే విషయమై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలనాధికారికి బీసీ సంఘాలు వినతి పత్రం సమర్పించాయి. రిజర్వేషన్లలో జరిగిన వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు అజయ్ యాదవ్(Ajay Yadav), వెంకటేశ్, శివశంకర్, శ్రీశైలం, వెంకటాచారి, అరవింద్ చారి తదితరులు పాల్గొన్నారు.

