FIH Pro League | పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు లండన్ లెగ్‌ను విజయంతో ఆరంభించింది. మంగళవారం లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ 4-3 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రో లీగ్ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. భారత సీనియర్ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
మ్యాచ్ ఆరంభంలోనే పాకిస్థాన్ దూకుడు ప్రదర్శించింది. ఎనిమిదో నిమిషంలో అహ్మద్ నదీమ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి పాక్‌కు ఆధిక్యం అందించాడు. అయితే రెండో క్వార్టర్‌లో భారత్ తిరిగి పుంజుకుంది. 22వ నిమిషంలో అభిషేక్ రీబౌండ్‌ను గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 24వ నిమిషంలో నిలకంఠ శర్మ మరో గోల్ చేసి భారత్‌కు 2-1 ఆధిక్యం అందించాడు.
మూడో క్వార్టర్‌లో భారత రక్షణ పటిష్టంగా నిలిచింది. 40వ నిమిషంలో అభిషేక్ ఇచ్చిన పాస్‌ను సుఖ్‌జీత్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును 3-1కు చేర్చాడు. అనంతరం 52వ నిమిషంలో రాజిందర్ సింగ్ పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాలుగో గోల్ నమోదు చేశాడు.
4-1తో వెనుకబడిన పాకిస్థాన్ చివరి క్షణాల్లో పోరాటం చేసింది. 53వ నిమిషంలో కెప్టెన్ అబూ మహ్మూద్ గోల్ చేయగా, మ్యాచ్ ముగియడానికి కేవలం 14 సెకన్లు మిగిలి ఉండగా మొయిన్ షకీల్ మరో గోల్ సాధించాడు. దీంతో స్కోరు 4-3గా మారినా, చివరి క్షణాల్లో భారత జట్టు ఆధిక్యాన్ని కాపాడుకుని విలువైన విజయాన్ని సొంతం చేసుకుంది.
