పేద విద్యార్థులకు ఆర్డీటీ వరం
పేద విద్యార్థులకు ఆర్డీటీ వరం
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) మరోసారి అండగా నిలిచింది. ఇప్పటి వరకు “ఆర్డీటీ సెట్” పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసిన సంస్థ.. ఈసారి కీలక మార్పులతో నేరుగా పదో తరగతి మార్కుల ఆధారంగా స్కాలర్షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని వందలాది మంది విద్యార్థులకు ఊరటనివ్వనుంది.
కోచింగ్, ప్రవేశ పరీక్షల ఒత్తిడి లేకుండానే ప్రతిభకు గుర్తింపు లభించనుంది. రెండు రకాల స్కాలర్షిప్‌లు స్పెషల్ స్కాలర్షిప్… ఈ విభాగంలో ఎంపికైన 400 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు మొత్తం ఆరేళ్లపాటు కళాశాల ఫీజులు, హాస్టల్ ఫీజులను నేరుగా విద్యాసంస్థలకు చెల్లించనున్నారు. పేద కుటుంబాలకు ఇది పెద్ద ఆర్థిక భారం తగ్గించే నిర్ణయంగా భావిస్తున్నారు.
సెమీ స్కాలర్షిప్…. ఈ విభాగంలో ఎంపికైన 1000 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ రెండేళ్లపాటు ఏడాదికి రూ.40 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
అర్హతలు ఇవే…. ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ సిలబస్‌లో చదివిన విద్యార్థులు పదో తరగతిలో 520 పైగా మార్కులు సాధించి ఉండాలి. సీబీఎస్ఈ విద్యార్థులు 500లో 430 మార్కులు పొందాలి. వీరు స్పెషల్, సెమీ స్కాలర్షిప్‌లకు అర్హులు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. స్టేట్ సిలబస్‌లో 550 పైగా మార్కులు సీబీఎస్ఈలో 500కు 450 పైగా మార్కులు సాధించిన వారు సెమీ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ని వర్గాలకు అవకాశం…
ఈసారి అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు అవకాశం కల్పించడం విశేషం. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధిక వేతనాలు పొందుతున్న కుటుంబాల పిల్లలు అనర్హులు. నెలకు రూ.15 వేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఎంపిక విధానం…
సమాన మార్కులు వచ్చినప్పుడు సైన్స్, గణితంలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిభతో పాటు కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు : పదో తరగతి మార్కుల మెమో, హాల్ టికెట్, విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ ప్రతులు, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, సంబంధిత ఆర్డీటీ ఏరియా కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.
ఆర్డీటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన మురళి మాట్లాడుతూ, “గతంలో ఆర్డీటీ సెట్ ద్వారా 400 మందిని ఎంపిక చేసేవాళ్లం. ఈసారి పరీక్ష లేకుండానే పదో తరగతి మార్కుల ఆధారంగా 1400 మందికి అవకాశం కల్పిస్తున్నాం” అని తెలిపారు. పేదరికం కారణంగా చదువు మధ్యలో ఆగిపోకూడదనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునివ్వనుంది.
