స్వచ్ఛందంగా 300 మందికి రక్తదానం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డిలోని సన్‌రైస్ హాస్పిటల్, సన్‌రైస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం భారీ రక్తదాన శిబిరంతో పాటు ఉచిత కార్డియాలజీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హాస్పిటల్ అధినేత స్వామిగౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు హాస్పిటల్ ఎండీ సంతోష్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. విశేషమేమంటే వైద్యులే రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఉచిత కార్డియాలజీ క్యాంపులో పలువురు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు.
హాస్పిటల్ అధినేత స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ లక్ష్యమని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవలే తమ వైద్యశాలలో కార్డియాక్ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
