24thaprilchintana | ప్రేమ, ధర్మం, శాంతి.. సత్యసాయి బోధనలు

24thaprilchintana | ప్రేమ, ధర్మం, శాంతి.. సత్యసాయి బోధనలు
24thaprilchintana | సత్యసాయిబాబా జననం నుంచి ఆధ్యాత్మిక యాత్ర
విద్య, వైద్యం, నీటి సేవల్లో విశేష కృషి
అద్భుతాలు, విమర్శలు.. భక్తుల విశ్వాసం
మరణానంతరం కూడా కొనసాగుతున్న సేవా వారసత్వం
24thaprilchintana | సత్య సాయిబాబా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఆయన తన జీవితకాలంలో లక్షలాది మంది భక్తులను ఆకర్షించారు. ప్రేమ, సేవ, శాంతి, సత్యం, ధర్మం వంటి ఆధ్యాత్మిక సూత్రాలను బోధించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.
శ్రీ సత్య సాయిబాబా 1926 నవంబర్ 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఆయన అసాధారణమైన ఆధ్యాత్మిక సామర్థ్యాలను ప్రదర్శించారు. అనేక భక్తులు ఆయనలో దైవిక శక్తి ఉందని నమ్మారు. 14 సంవత్సరాల వయసులో తాను శిర్డీ సాయిబాబా పునర్జన్మ అని ప్రకటించి, భక్తుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఆధ్యాత్మిక గురువుగా మారారు.
ఆయన బోధనల ద్వారా అనేక మంది జీవిత విధానంలో మార్పు తీసుకువచ్చి సమాజ సేవలో పాల్గొన్నారు. భక్తులు ఆయన బోధించిన నైతిక విలువలను తమ రోజువారీ జీవితాల్లో ఆచరిస్తున్నారు. సత్య సాయిబాబా స్థాపించిన సత్య సాయి ఆర్గనైజేషన్ 100 కంటే ఎక్కువ దేశాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థలు విద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా వంటి రంగాల్లో ముఖ్యమైన సేవలు అందిస్తున్నాయి. ఆయన బోధనలు అన్ని మతాలకు సమాన ప్రామాణికతను చూపించాయి.
సత్య సాయిబాబా బోధనల హృదయం ప్రేమ, మానవత్వం, సమానత్వం వంటి విలువల చుట్టూ తిరుగుతుంది. ఆయన సూచించిన ఐదు సూత్రాలు—సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస—ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. జీవితంలో నిజాయితీ, సత్యవంతత ముఖ్యమైన ఆధ్యాత్మిక గుణాలని ఆయన బోధించారు. కర్తవ్యాలను నిబద్ధతతో నిర్వహించడం, సమాజం పట్ల న్యాయంగా వ్యవహరించడం అవసరమని పేర్కొన్నారు. అంతర్గత ప్రశాంతత ద్వారా నిజమైన ఆనందాన్ని పొందవచ్చని వివరించారు. మత భేదాలను దాటి ప్రేమతో జీవించాలని సందేశం ఇచ్చారు. హింస లేకుండా శాంతియుత జీవితం గడపాలని ఉపదేశించారు.

సత్య సాయిబాబా సేవా మార్గం ప్రపంచానికి గొప్ప మార్గదర్శకంగా నిలిచింది. ఆయన అనేక విద్యాసంస్థలను స్థాపించారు. అక్కడ నాణ్యమైన విద్యతో పాటు ఆధ్యాత్మిక విలువలను బోధిస్తారు. విద్య వ్యాపారం కాకుండా సేవగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆయన స్థాపించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి. పేదలకు, బాధితులకు ఉచిత చికిత్స అందించడంలో ఈ ఆసుపత్రులు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.
అలాగే, అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు కోట్లాది మందికి మేలు చేకూర్చాయి. సత్య సాయిబాబా భక్తుల ముందు అనేక అద్భుతాలను ప్రదర్శించారు. విభూతిని చేయి నుంచి సృష్టించడం, వస్తువులను క్షణాల్లో ఉత్పత్తి చేయడం వంటి అద్భుతాలు భక్తుల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఈ అద్భుతాలు కొందరి విమర్శలకు గురైనా, భక్తులు వాటిని ఆయన ఆధ్యాత్మిక శక్తులుగా భావించారు.
అయితే, ఆయన తన జీవితకాలంలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఆయన చేసే అద్భుతాలను కొందరు మాయాజాలంగా అభివర్ణించారు. ఆయనపై కొన్ని ఆర్థిక అక్రమాల ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ, భక్తులు ఈ విమర్శలను తోసిపుచ్చి, ఆయనను భగవంతుని అవతారంగా భావిస్తూ తమ విశ్వాసాన్ని కొనసాగించారు. ఈ విమర్శలు ఆయన ఆధ్యాత్మిక ప్రభావాన్ని తగ్గించలేకపోయాయి.
2011 ఏప్రిల్ 24న సత్య సాయిబాబా తన భౌతిక దేహాన్ని విడిచారు. ఆయన మరణం భక్తులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే, ఆయన స్థాపించిన సంస్థలు, ఆశయాలు, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. సత్య సాయిబాబా జన్మస్థలం పుట్టపర్తి ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఆయన సమాధి వద్ద ప్రతిరోజూ అనేక భక్తులు ప్రార్థనలు చేస్తూ ఆయన బోధనలను స్మరించుకుంటున్నారు.
ఆయన స్థాపించిన విద్యా, ఆరోగ్య సేవా సంస్థలు ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యను, పేదలకు వైద్య సేవలను అందిస్తున్నాయి. “మానవ సేవే దేవ సేవ” అన్న ఆయన సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన సేవా కార్యక్రమాలు ప్రపంచానికి వెలుగునిచ్చే దీపాలుగా కొనసాగుతున్నాయి.
సత్య సాయిబాబా జీవితం ఒక ఆదర్శం. ఆయన చూపిన మార్గం, బోధనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆధ్యాత్మికత, సేవ, ప్రేమ కలిసిన జీవన విధానమే ఆయన జీవన దర్శనం. ఆయన సేవా భావం మరెన్నో తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
రామకిష్టయ్య సంగనభట్ల
9440595494
