245 points | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం

245 points | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం

245 points | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా అనుకూల సంకేతాలు రావడం, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తున్నాయనే వార్తలు మార్కెట్లకు భారీ ఊతమిచ్చాయి. ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టడం కూడా పెట్టుబడిదారుల్లో సానుకూల భావన పెంచింది.

ఉదయం ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 875 పాయింట్లు లాభపడి 76,292 స్థాయికి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ 245 పాయింట్లు ఎగిసి 23,969 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు ఉత్సాహంగా కదిలాయి.

ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, లార్సెన్ అండ్ టుబ్రో వంటి హెవీవెయిట్ షేర్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కూడా సూచీల ర్యాలీకి మద్దతుగా నిలిచాయి.

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 40పైసలు బలపడి రూ.95.42 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం భారత మార్కెట్లకు ఊరటనిచ్చింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై ఆశావహ సంకేతాలు రావడంతో ఆసియా మార్కెట్లలో కూడా కొనుగోళ్లు పెరిగాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జియోపాలిటికల్ టెన్షన్స్ తగ్గడం, క్రూడ్ ధరలు నియంత్రణలో ఉండటం కొనసాగితే భారత మార్కెట్లు మరింత బలపడే అవకాశముందని చెబుతున్నారు.

Leave a Reply