ప్రకృతి ఒడిలో యోగా సందేశం..
ప్రకృతి ఒడిలో యోగా సందేశం..
మోతుగూడెం డ్యామ్ వద్ద ఘన యోగా సాధన
ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్ కె. దినేష్ కుమార్
చింతూరు, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధనను అలవాటుగా మార్చుకోవాలని పోలవరం (రంపచోడవరం) జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల యోగా సాధన కార్యక్రమంలో భాగంగా బుధవారం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని ఫోర్‌బే డ్యామ్ వద్ద యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 45 వేల మంది యోగా కార్యక్రమాలకు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో ప్రముఖ టూరిస్ట్ కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్స్‌లో యోగా నిర్వహించగా, తాజాగా మోతుగూడెం డ్యామ్ వద్ద యోగా సాధన చేపట్టినట్లు పేర్కొన్నారు.
పోలవరం జిల్లాలో అపారమైన పర్యాటక సామర్థ్యం ఉందని, ‘పుష్ప’, ‘అఖండ’ వంటి ప్రముఖ చిత్రాల చిత్రీకరణ ఈ ప్రాంతాల్లో జరిగిందని గుర్తు చేశారు. ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
చింతూరు, మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు అనువైన పర్యాటక కేంద్రాలని పేర్కొంటూ, పర్యాటకులు పోలవరం జిల్లాను సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కోరారు.
శాసన సభ్యురాలు మిరియాల శిరీషా దేవి మాట్లాడుతూ, యోగా సాధనను ప్రజా ఉద్యమంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జిల్లా, మండల, గ్రామ, సచివాలయ స్థాయిల్లో విద్యార్థులు, ఉపాధి హామీ కార్మికులు, గిరిజనులు, ప్రజల భాగస్వామ్యంతో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 21న రంపచోడవరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
యోగా గురువు ఆధ్వర్యంలో యోగా ప్రోటోకాల్ ప్రకారం 45 నిమిషాల పాటు యోగా సాధన నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గాంధీబాబు, చింతూరు సబ్ కలెక్టర్, ఐటीडీఏ పీవో శుభం నొక్వాల్, ఓఎస్‌డీ పంకజ్ కుమార్ మీనా, ఏఎస్పీ బి. హేమంత్, సబ్ డీఎఫ్‌వో శివకుమార్ గంగల్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, డీఎంహెచ్‌వో డాక్టర్ పి. సరిత, డీఆర్‌డీఏ పీడీ డాక్టర్ దాసరి రత్నాకర్ రావు, ఐసీడీఎస్ పీడీ కె. ఉమా, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
