AP |పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం – సినిమా థియేటర్లలో తనిఖీలు షురూ

కాకినాడ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది.

ఏపీలోని సినిమా థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు చేశారు. అలాగే పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్‌ థియేటర్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో పవన్ కల్యాణ్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్ల బంద్ అంశంతో పాటు సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల సమస్యలపై లోతుగా చర్చించారు.

థియేటర్లలో తినుబండారాల ధరలు అధికంగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాలకు దూరంగా ఉంటున్నారనే వాదన బలంగా ఉంది. దీంతో థియేటర్లలో తనిఖీలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేశ్ తో పటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాప్‌కార్న్ తో పాటు పఫ్ లు, స్వీట్ కార్న్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పై అధిక ధరలు ఉన్నాయనే వాదన ఉంది.పైగా కనీస వసతులు కూడా ఉండట్లేదనే ఫిర్యాదులు కూడా అందడంతో.. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్‌లో ఫుడ్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ధరలపై విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యారు.

ఈ రోజు సాయంత్రం ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లోని థియటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేపు కూడా ఈ తనిఖీలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో రేపటి వరకు తినఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply