10Hours | ఎవరో గెలిచారో తెలిస్తే షాక్ అవుతారు!
10Hours | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్; అమెరికాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ Figure AI, మానవ సామర్థ్యానికి , రోబోటిక్ టెక్నాలజీకి మధ్య గల వ్యత్యాసాన్ని పరిశీలించడానికి 10 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఒక ఆసక్తికరమైన పోటీని నిర్వహించింది. ఒక లాజిస్టిక్స్ వేర్‌హౌస్ వాతావరణంలో కన్వేయర్ బెల్ట్ మీద వేగంగా వచ్చే ప్యాకేజీలను సార్టింగ్ చేయాలి. ప్రతి ప్యాకేజీపై ఉన్న బార్‌కోడ్ ఒకే వైపు ఉండేలా చూస్తూ వాటిని సరిగ్గా పెట్టడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం.

ఒకవైపు ‘ఐమే’ అనే మనిషి, మరోవైపు కంపెనీకి చెందిన అత్యంత అధునాతన హ్యూమనోయిడ్ రోబో ‘Figure 03’ ఈ పోటీలో తలపడ్డాయి. మనిషి (ఐమే) మొత్తం 12,924 ప్యాకేజీలను సార్ట్ చేశాడు. ఇందుకు సగటున ఒక ప్యాకేజీకి 2.79 సెకన్ల సమయం పట్టింది. రోబో (Figure 03) మొత్తం 12,732 ప్యాకేజీలను సార్ట్ చేసింది. ఇందుకు సగటున ఒక ప్యాకేజీకి 2.83 సెకన్ల సమయం పట్టింది. చివరకు, రోబో కంటే కేవలం 192 ప్యాకేజీల ఆధిక్యంతో, మైక్రో సెకన్ల వేగంతో మనిషి ఈ పోటీలో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. రోబో రన్నరప్‌గా నిలిచింది.
అయితే 10 గంటల పాటు విరామం లేకుండా పనిచేయడం వల్ల మనిషి (ఐమే) తీవ్రంగా అలసిపోయాడు. పోటీ ముగిసే సమయానికి అతని చేతి వేళ్లకు బొబ్బలు వచ్చాయి. మరోవైపు రోబోకు ఎలాంటి అలసట లేదు. దానికి బాత్‌రూమ్ బ్రేకులు గానీ, విశ్రాంతి గానీ అవసరం లేదు. 10 గంటల పాటు ఒకే రకమైన వేగంతో, స్థిరత్వంతో అది పని చేస్తూనే ఉంది. పోటీ ముగిసిన తర్వాత కూడా రోబో ఏమాత్రం ఆగకుండా తన పనిని కొనసాగించింది.
Figure AI సంస్థ సీఈఓ బ్రెట్ అడ్‌కాక్ ఈ ఫలితాలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. “ఈ రకమైన శారీరక శ్రమతో కూడిన పోటీలో రోబోపై మానవుడు గెలవడం బహుశా ఇదే చివరిసారి ఏమో!” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోటీ ద్వారా ప్రస్తుతానికి శారీరక వేగంలో, సమయస్ఫూర్తిలో మనిషే మేటి అని నిరూపితమైనప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో భవిష్యత్తులో రోబోలను దాటడం మనిషికి చాలా కష్టమనే సంకేతాన్ని ఈ పోటీ ఇచ్చింది.
