108Seats | గవర్నర్ తీరుపై హీరోల అసహనం!
108Seats | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఉత్కంఠత తారాస్థాయికి చేరింది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించడం గవర్నర్ జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు ఓటు వేసిన ప్రజలతో పాటు, కొలీవుడ్ సినీలోకం విజయ్ కు మద్దతు తెలిపింది. గవర్నర్ విజయ్ పార్టీ ఏర్పాటు ఆమోదం తెలుపకపోవడం.. ప్రజల తీర్పును అవమానించడమేనని విజయ్ కు అండగా పలువురు గళమెత్తారు.
ఇది ప్రజల తీర్పును అగౌరవపరచడమే – కమల్ హాసన్
రాజ్‌భవన్ వ్యవహరిస్తున్న తీరుపై మక్కల్ నీది మయ్యమ్ అధినేత, నటుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. “108 సీట్లు గెలుచుకున్న విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం ప్రజల తీర్పును అగౌరవపరచడమే” అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చుంటామన్న స్టాలిన్ రాజకీయ పరిణతిని అభినందించిన కమల్, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలోనే నిరూపించుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన 233 మంది ఇప్పటికి ప్రమాణ స్వీకారం చేయలేదని.. ఇది రాష్ట్రానికి జరిగిన అవమానం అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
గవర్నర్ తీరు అసహ్యకరం- ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం గవర్నర్ తీరును తప్పుబట్టారు. విజయ్‌కు ప్రజల మద్దతు ఉందని, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా టీవీకేకు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజలు విజయ్‌కు పట్టం కట్టారని, ఆయనకు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
విజయ్ సీఎం కావడం ఖాయం – హీరో విశాల్
మరోవైపు నటుడు విశాల్ విజయ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. గతంలో గోవా, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలనే ఇక్కడ కూడా పాటించాలని డిమాండ్ చేశారు. “ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు, టీవీకే దాదాపు మెజారిటీ సాధించింది. గవర్నర్ ఎందుకు సంకోచిస్తున్నారు?, ప్రజల తీర్పును గౌరవించడం ఎక్కడ ఉందో చెప్పాలని” విశాల్ ప్రశ్నించారు. విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సినీ రంగం నుంచి వచ్చిన మద్దతు విజయ్ బలాన్ని మరింత పెంచింది. మరి ఈ రాజకీయ ప్రతిష్టంభనకు గవర్నర్ ఎప్పుడు తెరదించుతారో వేచి చూడాలి.
