chaos | సెర్బియా పార్లమెంట్ లో ర‌ణ‌రంగం.. స్మోక్ బాంబుల‌తో రెచ్చిపోయిన విప‌క్షాలు

సెర్బియా పార్లమెంట్ లో విపక్ష సభ్యుల నిరసనలతో సెర్బియా పార్లమెంటు అట్టుడికింది. సభ్యులు రెచ్చిపోయారు. స్మోక్‌ బాంబులు, మండే స్వభావం కలిగిన ఇతర వస్తువులు విసురుకున్నారు. దాంతో సెర్బియా పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. కోడిగుడ్లు, వాటర్‌ బాటిల్స్ కూడా విసురుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ఎంపీలకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అస‌లు కార‌ణం ఏమిటంటే …

సెర్బియా పార్లమెంట్ అట్టుడికిపోవడానికి కారణం లేకపోలేదు. యూనివర్సిటీ విద్యకు ఫండ్స్ పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్‌ సమయంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అధికార పార్టీ అనేక నిర్ణయాలను ఆమోదించే యోచనలో ఉందని ఆరోపిస్తూ విపక్షాలు నిరసనకు దిగాయి. ఇది చట్ట విరుద్ధం అని నినాదాలు చేశారు. ఇక గత నవంబర్ లో సెర్బియాలోని ఉత్తర ప్రాంతంలో రైల్వేస్టేషన్‌ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది చనిపోయారు. విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దాంతో మిలోస్‌ వుచెవిచ్‌ ప్రధాని పదవికి ఇటీవల రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలోనే ప్రధాని మిలోస్‌ వుచెవిక్‌ రాజీనామాను వెంటనే ఆమెదించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. బ్యానర్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా స్మోక్‌ బాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిల్స్ విసురుకునే వరకు వెళ్లింది.

స్మోక్ బాంబులు విసురుకోవడంతో సభ మొత్తం పొగతో నిండిపోయింది. శ్వాస ఆడక సభ్యులు ఇబ్బందిపడ్డారు. అసలేం జరుగుతుందో తెలియక కొందరు భయాందోళనకు గురయ్యారు. ఒకరిపై మరొకరు స్మోక్ గ్రనేడ్లు విసురుకోవడం సంచలనంగా మారింది. కోడిగుడ్లు విసురుతూ ర‌ణ‌రంగాన్ని త‌ల‌పింప‌జేశారు.. చివ‌ర‌కు మార్ష‌ల్స్ వ‌చ్చి విప‌క్ష ఎంపీల‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *