ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. కదిలిన ఎక్సైజ్ శాఖ..
- గర్మిళ్లపల్లిలో ప్రత్యేక దాడులు.. ఇద్దరి అరెస్ట్
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లాలో అక్రమ నాటుసారా తయారీపై ఆంధ్రప్రభలో జూలై 25న “గుడుంబా గుప్పిట్లో పల్లెలు” శీర్షికతో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దళం (డీటీఎఫ్) సిబ్బంది గర్మిళ్లపల్లి మండలంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీగా నాటుసారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గర్మిళ్లపల్లి మండలంలోని అంకుషాపురం, ఒంటిమిట్ట గ్రామాల శివార్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన నాలుగు బెల్లం పులుసు నిల్వలను గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 15 లీటర్ల నాటుసారా, 700 లీటర్ల బెల్లం పులుసు, 10 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నాటుసారా రవాణాకు ఉపయోగిస్తున్న టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు, నిందితులపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
