నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీపీఐ నివాళి
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ధూళిపాళ ధనుంజయ నాయుడు విమర్శలు
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నీట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేరేడుచర్ల పట్టణ సీపీఐ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నీట్ రద్దు కోసం ఆందోళనల్లో పాల్గొని ఆత్మహత్య చేసుకున్న 23 మంది విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ నీట్ కారణంగా మరో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎంతమంది విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటాయో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం బీహార్, బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నిరుద్యోగ యువత, విద్యార్థుల పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్, బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, శ్రీపాద శ్రీనివాసచారి, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
