సరస్వతీ అమ్మవారి నామస్మరణతో మార్మోగిన బాసర క్షేత్రం

సరస్వతీ అమ్మవారి నామస్మరణతో మార్మోగిన బాసర క్షేత్రం

బాసర, ఆంధ్రప్రభ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తుల సరస్వతి నామస్మరణతో మారుమోగింది. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రోజంతా భక్తుల సందడితో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. అమ్మవారి సర్వదర్శనానికి భక్తులకు రెండు గంటలకు పైగా సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు గంట సమయం పడుతోంది. ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపాల్లో అర్చకులు వేదమంత్రాల మధ్య చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

గోదావరి తీరంలో భక్తజన సందోహం..
ఆషాఢ మాసం ఆదివారం, పౌర్ణమిని పురస్కరించుకొని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, తీరాన ఉన్న సూర్య భగవానుడి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. మహిళా భక్తులు గోదారమ్మకు పిండివంటలను నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు మరియు సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు.

Leave a Reply