కలసి యోగా చేద్దాం.. యోగాంధ్రను నిలబెడదాం..

కలసి యోగా చేద్దాం.. యోగాంధ్రను నిలబెడదాం..
ఈ నెల 7 నుంచి పండగలా యోగా ప్రత్యేక కార్యక్రమాలు.
సమష్టిగా కృషిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 14 రోజుల పాటు జిల్లాస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. యోగాంధ్ర-2026 కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతేడాది యోగాంధ్రను విజయవంతంగా నిర్వహించి.. అందరికీ ఆదర్శంగా నిలిచామని, ప్రపంచ రికార్డులు సైతం సొంతం చేసుకున్నామని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్యం, ఆయుష్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మునిసిపల్, విద్య, పర్యాటకం, యువజన సంక్షేమం, క్రీడలు తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా థీమాటిక్ యోగాలో భాగంగా మన జిల్లాలో పోలీస్ థీమ్‌తో యోగా కార్యక్రమం జరగనుందని తెలిపారు. టూరిజం యోగాలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం, పవిత్ర సంగమం వద్ద, హరిత బెరం పార్కులో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, మైదానాలు తదితర ప్రాంతంలో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మునిసిపల్, అర్బన్ ప్రాంతంలోని ప్రతి పార్కులోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
కూడళ్ల వద్ద స్క్రీన్లపై యోగా ప్రోటోకాల్‌కు సంబంధించిన వీడియోలను ప్రదర్శించాలని సూచించారు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ.. ప్రజలు, ప్రజాప్రతినిదులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషిచేసి కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. అధికారులతో కలిసి 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. వెన్యూ మ్యాపింగ్, పర్యవేక్షణ, ప్రజా భాగస్వామ్యం, శాఖల మధ్య సమన్వయంపై జిల్లాస్థాయి కమిటీ ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్న ప్రియదర్శిని, డా. ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డా. బుల్లయ్య, డా. ఎఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. పి.జగదీష్, వైద్యాధికారులు డా. సుకన్య, డా. పద్మజ, డా. లలిత, డా. వాణి, డా. విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
