గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కల్పన సస్పెండ్

గిరిజన గురుకులాల కార్యదర్శి సీతలక్ష్మి ఉత్తర్వులు

కొత్తగూడ, ఆంధ్రప్రభ: గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కల్పనను సస్పెండ్ చేస్తున్నట్లు గిరిజన గురుకులాల కార్యదర్శి సీతలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థినులకు టాయిలెట్లు, మంచినీటి సమస్యలపై స్పందించకుండా, మరమ్మత్తుల కోసం విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు అడిగినట్లు ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన అధికారులు ప్రిన్సిపాల్ కల్పనపై సస్పెన్షన్ వేటు వేశారు.

గురుకులంలోని టాయిలెట్ల మరమ్మత్తుల కోసం నిధులు మంజూరైనప్పటికీ, ఇప్పటి వరకు పనులు చేపట్టకుండా కాలయాపన చేయడం సరైనది కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మంత్రి సీతక్క విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే టాయిలెట్ల మరమ్మత్తులు చేపట్టించారు. మరమ్మత్తుల కోసం నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని మంత్రి సీతక్క ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, గురుకులంలో పీఎం శ్రీ నిధులు, అడ్మిషన్ల వ్యవహారాలపై లోతైన విచారణ జరిపించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.