Pawan Kalyan | తెలంగాణే నా స్ఫూర్తి.. పవన్ కళ్యాణ్
Pawan Kalyan | తెలంగాణే నా స్ఫూర్తి.. పవన్ కళ్యాణ్
రాజకీయాల కోసం కాదు
Pawan Kalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణతో తనకున్న అనుబంధం రాజకీయాల కోసం ఏర్పడింది కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆలోచనకు ముందే ఈ ప్రాంతం నుంచి తాను పోరాట స్ఫూర్తిని పొందానని తెలిపారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, తండాల్లో తాను తిరిగానని పవన్ గుర్తుచేశారు. ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో కాకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే తపనతోనే అప్పుడు ఆ ప్రాంతాల్లో పర్యటించానని అన్నారు. ఆ రోజుల్లో తండాల్లో తాగునీటి సమస్యలు, ప్రజల ఇబ్బందులు తనను తీవ్రంగా కదిలించాయని పేర్కొన్నారు.
ఏపీలో తనను తిరగనివ్వని పరిస్థితులు వచ్చినప్పుడు, తెలంగాణలో వారాహి యాత్రకు అనుమతి లభించిందని పవన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తన పర్యటనలకు అడ్డంకులు సృష్టించిన సమయంలో కోదాడ, నల్గొండ ప్రజలు తనకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
ఇవాళ తనను విమర్శించే గొంతులు 2007లో ఎక్కడున్నాయని పవన్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం, ప్రజల సమస్యల కోసం తాను చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో తిరిగానని అన్నారు. తెలంగాణ నలుమూలలా పర్యటించిన వాడిని తానేనని, ఈ నేల తనకు పోరాట పాఠాలు నేర్పిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణపై తన ప్రేమ కొత్తగా వచ్చినది కాదని, విభజన తర్వాత ఏర్పడినది కూడా కాదని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలపై తనకు గౌరవం, అభిమానం ఉన్నాయని ఆయన తెలిపారు.
