చెప్పుతో కొడతా అంటూ ఆర్‌సీఓ వ్యాఖ్యలు..?
పోగుల్లపల్లి ఏకలవ్య పాఠశాలలో ఉద్రిక్తత
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో తాగునీటి సమస్య తీవ్రరూపం
కొత్తగూడ, ఆంధ్రప్రభ : మండలం లోని పోగుల్లపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే బైఠాయించి నిరసన చేపట్టారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అప్పుడే పాఠశాల ను సందర్శించడానికి చేరుకున్న ఆర్ సీ ఓ రత్నకుమారి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడే సమయంలో “చెప్పుతో కొడతా” అంటూ వ్యాఖ్యానించారని విద్యార్థులు ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాఠశాల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్ సీ ఓ వాహనాన్ని అడ్డుకుని మాపై దుర్భాషలాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ పరిణామాల మధ్య ఆర్‌సీఓ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
అనంతరం ఎంపిడిఓ అనురాధ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.విద్యార్థులు తాగునీటితో పాటు హాస్టల్‌లోని ఇతర మౌలిక వసతుల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపి విద్యార్థుల పై అనుచిత వాక్యలు చేసిన ఆర్ సీ ఓ పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు
