అండగా ప్రభుత్వం.. మంత్రి భరోసా
చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ..
పెండింగ్ బిల్లులు, మైనింగ్ అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న వెల్లడి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, మాజీ వైస్ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌రెడ్డి మృతి బాధాకరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన శ్రీనివాస్‌రెడ్డి పెండింగ్ బిల్లులు సుమారు రూ.5.3 కోట్లు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీఆర్ఎఫ్ పనులకు సంబంధించిన వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేసినట్లు వెల్లడించారు.
మైనింగ్ అధికారుల చర్యలపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.5 కోట్ల బకాయిలు రావాల్సిన కాంట్రాక్టర్‌కు రూ.54 కోట్ల నోటీసులు జారీ చేయడం అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. క్రషర్లు, మైనింగ్ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు వంటి సమస్యలపై సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ అంశాలపై మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులు, మైనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
