YSRCP | రూ.4,969 కోట్ల రాయితీ ఇచ్చాం

YSRCP | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం మహిళల స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన వడ్డీ రాయితీ హామీని విస్మరించిందని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఎన్నికల సమయంలో రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించింది.

స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని వైసీపీ పేర్కొంది. మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడే వడ్డీ రాయితీ పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది.

వైసీపీ హయాంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మొత్తం రూ.4,969 కోట్ల వడ్డీ రాయితీ అందించామని తెలిపింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించింది. మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని వైసీపీ డిమాండ్ చేసింది.