Great-Secular-Village : మతం లేదు Andhra Prabha Spl Story

Great-Secular-Village : మతం లేదు Andhra Prabha Spl Story

  • కులం తేడా లేదు
  • ఆ ఊళ్లో ముస్లీంలూ లేరు
  • కానీ మతసామరస్యం ఈ ఊరి చిరునామా
  • మతాలకు అతీతంగా పీర్ల సంబరం
  • అదే అంకభూపాలెంలో పెద్ద సరిగేసు
  • ముస్లిమేతరులే నిర్వాహుకులు
  • కట్టుబాటుగా మాంసాహారానికి దూరం
  • బంధుమిత్రులతో ఇంటిల్లిపాది పండగ కళ

( అర్ధవీడు , ఆంధ్రప్రభ)

Great-Secular-Village : అది నల్లమలకు సరిహద్దు గ్రామం. ఆధునిక, మత విద్వేష సంస్కృతి, అంచలంచలుగా ఆ గ్రామాన్ని కమ్మేస్తున్నా.. తమ పూర్వీకులు వేసిన మత సామరస్యం అనే విత్తు మహా వృక్షంగా వికసిస్తోంది. అందుకు ఆ గ్రామంలో ఏటా నిర్వహిస్తున్న పీర్ల పండుగ ఒక నిదర్శనం. అదే అర్థవీడు మండలంలోని లోని అంకభూపాలెం గ్రామం.

Great-Secular-Village : ఈ గ్రామంలొ సుమారు 100 కుటుంబాలు ఉంటాయి. ముస్లిం కుటుంబం ఒక్కటీ లేదు. అయినప్పటికీ ముస్లింలే ఆశ్చర్య పడేలా పీర్ల పండుగ( మొహరం)ను అత్యంత కఠిన నియమాలను పాటిస్తూ నిర్వహిస్తారు. మొహరం ఆరంభానికి ముందు నెల పొడుపు (చంద్ర వంక కనిపించడం) పొడిసిన దగ్గర నుండి సామూహికంగా మాంసాహారాన్ని స్వీయ నిషేదాన్ని పాటిస్తారు. బడిలో పెట్టే భోజనం లో గుడ్డును సైతం చిన్నారులు తిరస్కరిస్తారంటే ఆశ్చర్యం లేదు.

Great-Secular-Village : నిర్వహణలో సామ్యవాదం

పండుగ నిర్వహనకు ఆయ్యే ఖర్చును సోషలిస్ట్ (సామ్యవాదం) పద్దతిలో భరిస్తారు. గ్రామానికి పంటల వల్ల, పశువుల అమ్మకాల వచ్చే రాబడిలో నూటికి రూపాయి చొప్పున చందాలు పోగు చేస్తారు. గమిళ్లు, బందెల దొడ్లు వేలం పాటల ద్వారా ఆదాయం సమకూరుస్తారు. ఇందులో వ్యవసాయ భూమి లేనివారికి, భూమి ఉండి పైరు వేయని వారికి, కుల వృత్తుల వారికి మినహాయింపు ఉంటుంది. అంటే రాబడి వున్నవారే ఖర్చులో భాగస్వాములు అవుతారు. అలాగే నిప్పుల గుండం కాల్చేందుకు అవసరమయ్యే కర్రను ఎద్దులు ఉన్న వారు మాత్రమే సమాకూరుస్తారు. ఎద్దులు లేని వారికి మినహాయింపు. గ్రామ పెద్దల మార్గ దర్శనంలో గ్రామస్తులు భాగస్వాములవుతారు.

Great-Secular-Village ఆచారాలు.. ఆత్మవిశ్వాసాలు

పీర్ల పండుగను సంబరంలా కాక ఆచారంగా వ్యవహారిస్తారు. బంధు మిత్రులను, కొత్త అల్లుళ్లను, ఆడపడుచులను ఈ సందర్బంగా ఆహ్వానిస్తారు. నాలుగు రోజులు నిర్వహించే పండుగలో పీర్లను ఎత్తుకునే వారు ( గణాచారులు ) ఉపవాసం వుంటారు. నేల పైనే సేద ధీరుతారు. పెద్ద పండుగ రోజు గణాచారులను, పీర్ల ఊరేగింపును రోప్ పార్టీ మధ్యలో అంటూ ముట్టు కు దూరంగా నడిపిస్తారు. నిప్పుల గుండం పై నడిచిన తరువాత తాళ్ళ బంధీని తొలగిస్తారు. ఈ క్రమంలో ఆదర్శమూర్తి రాముల వారికి పీర్లు సలాం చేయడం ఇక్కడి విశేషం. ఈ సందర్బంగా సంతానం కోసం ఖాసీం స్వామికి ముడుపులు కడతారు. ఈ విశ్వాసానికి ప్రతీక అన్నట్లు గ్రామంలో కాశయ్య, బాదుల్లా, మస్తాన్ అనే పేర్లతో అనేక మంది తారసపడతారు. ఇలా అనేక మక్కులు తీరాయని తమ సొంత ఖర్చులతో సరిగేసు (పీర్ల ఉత్సవం చేయించడం ఆనవాయితీగా వస్తోంది.

Great-Secular-Village పల్లె కళలకు వికాసం

పండుగ చివరి రోజు పల్లె కళలు కనుల విందు చేస్తాయి. స్థానికులే గద్దె సోది చేప్పే వారీగాను, పోలీసు, డప్పు కొట్టే వారీగాను, చెంచులుగాను వేష దారణలు వేసి అలరిస్తారు. చేయి చేయి పట్టి నిప్పుల గుండం చుట్టూ తిరుగుతూ.. ముక్త కంఠంతో దేవసం దేవలం అంటూ చిందులు తొక్కుతారు. అనంతరం నిప్పులపై పాలను మరిగించి ఎటు వైపు పొంగు వస్తుందో గమనిస్తారు. పాల పొంగు ఎటు వైపు పొంగుంతుందో అటు వైపు పంటలు బాగా పండు తాయని విశ్వాసిస్తారు.

Great-Secular-Village పని విభజనకు ప్రతీక

ఈ పండుగ పూర్వపు పని విభజనకు ప్రతీకగా నిలుస్తుంది. గ్రామంలోని ప్రతి వృత్తిదారు తన ప్రత్యేక పనితో భాగస్వామ్యం అవుతారు. గుండం తవ్వడం, పూడ్చడం వడ్డెరుల భాద్యతగా కొనసాగుతుంది. దివిటి వెలిగించి, పట్టే భాద్యత రజకులు చూస్తారు. సాంబ్రాని వేసేందుకు అవసరమయ్యే ఊదుదోనిని కుమ్మరి వారు సమాకూరుస్తారు. లయ బద్ధమైన మేళాన్ని, నాటైన చింధులకు అనువైన దరువులను సాంప్రదాయ కళాకారులే ఇప్పటికీ అందిస్తున్నారు. ఇలా పీర్ల పండుగను ముస్లిమెతరులు నిర్వహిస్తూ మత సామరస్యాన్ని, గ్రామీణ సామ్యవాదాన్ని, సనాతన సంప్రదాయాలని ఉగాది పచ్చడిలా మేళవించి కొనసాగించడం అరుదైన, ఆలోచణీయమైన సాంప్రదాయం అనడంలో సందేహం లేదు.