‘యోగా’తో ఒత్తిడి దూరం..

యోగా’తో ఒత్తిడి దూరం..

కార్గిల్ పార్క్‌లో ప్రత్యేక శిబిరం

పాల్గొన్న సుమారు 200 మంది సిబ్బంది

శ్రీకాకుళం, జూన్ 12 (ఆంధ్రప్రభ): యోగాంధ్ర‌ 2026 కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం కార్గిల్ పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రెండు శాఖలకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఒకేచోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు ప్రదర్శించారు. నిత్యం విధుల్లో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలిగించడంలో యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనురాధ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

షిర్డీ సాయి యోగా కేంద్రం శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన సురేంద్ర, జాడ చంద్రశేఖర్, నాగలక్ష్మి, కాంక్యాన మురళి, శ్రీను తదితరులు పాల్గొని సిబ్బందికి వివిధ ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలతో మమేకమవుతూ విధులు నిర్వహించే సంక్షేమ శాఖల సిబ్బందికి యోగా ఒక ఔషధంలా పనిచేస్తుందని, ఒత్తిడిని తగ్గించి పనితీరును మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెండు శాఖలకు చెందిన అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.