మానసిక ఒత్తిడికి యోగా దివ్యౌషధం
మానసిక ఒత్తిడికి యోగా దివ్యౌషధం
ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగాసనాలే రాజమార్గం: జెడ్పీ సీఈఓ వెంకటరామన్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఆరోగ్యకరమైన జీవనానికి యోగాసనాలే రాజమార్గమని, మానసిక ఒత్తిడికి యోగా ఒక దివ్య ఔషధమని జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కార్గిల్ పార్కులో జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, వివిధ ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని అన్నారు.
యోగాభ్యాసం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సు, శ్వాస, శరీరాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే సమగ్ర సాధనమని వివరించారు. ప్రస్తుతం నేర్పిస్తున్న యోగా విధానాలు చాలా సరళమైనవని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే క్రమం తప్పకుండా సాధన చేయవచ్చని తెలిపారు.
నిత్యం యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయని పేర్కొన్నారు. గత కొంతకాలంగా యోగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆయుష్ శాఖ అధికారులు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, యోగా గురువులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి, ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగాలు, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా ఉత్తమ మార్గమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాసనాలను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు.
యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మను అనుసంధానించే జీవన విధానమని, దీని ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల దృక్పథం పెంపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యోగా గురువులు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది, ఆయుష్ శాఖ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
