రైతులు అధైర్య పడవద్దు ఆందోళన చెందవద్దు…

రైతులు అధైర్య పడవద్దు ఆందోళన చెందవద్దు…

  • మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆంధ్రప్రభ : యాసంగి సీజన్ లో భారీ మొత్తంలో పంట చేతికి రావడం వల్ల ఆలస్యం అవుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని, ఆధైర్యపడవద్దని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మంథని వ్యవసాయ మార్కెట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసే వరకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచడమే కాకుండా కొనుగోలు విషయం పైన ఎందుకు ఆలోచన చేయడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలోని వ్యవసాయం అంటే పండుగలా మారిందని వివరించారు. ప్రభుత్వ గోదాములు సరిపడకపోతే ప్రైవేట్ గోదాములను సైతం ఉపయోగించుకొని వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసి మద్దతు ధర అందజేస్తామని రైతులందరూ అండగా ఉండాలని పేర్కొన్నారు.

వర్షాలు చెప్పి రావని, వాతావరణ మార్పు వల్ల వర్షాలు సంభవిస్తున్నాయని, రైతాంగం ఇబ్బంది పడడం పట్ల బాధగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. రైతాంగం పడుతున్న బాధను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని తెలిపారు. ప్రతిపక్షాలకు వర్షాలు చెప్పి వస్తాయా అని ఎద్దేవా చేశారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, ఆర్డీవో సురేష్, ఏడిఏ అంజనీ మిశ్రా, ఏఓ నవ్య మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ఆర్టిఏ మెంబర్ సురేష్, నాయకులు తొట్ల తిరుపతి, గోటికార్ కిషన్ జి, మంథని సత్యం, ఎరుకల ప్రవీణ్, కొటారి బాపు, నాయినేని జగన్ మోహన్ రావు, కర్ణ కృష్ణ, మాజీ సర్పంచ్ దొరగొర్ల శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply