డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన ర్యాలీ..

  • లోకేష్ రాజీనామా చేయాల్సిందే”…
  • రోడ్డెక్కిన నిరుద్యోగులు వైసీపీ శ్రేణులు

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోమవారం నందికొట్కూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తుగా నోటీసులు జారీ చేసినప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మిడ్తూరు రోడ్డు మీదుగా అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు కొనసాగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుద్దీర్‌ దారా, నియోజకవర్గ పరిశీలకుడు బుడ్డా శేషిరెడ్డి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

డీఎస్సీ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఫేక్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో నందికొట్కూరు పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవద్దు

ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ సుద్దీర్‌ దారాకు ముందుగానే నోటీసులు అందజేశారు. అయితే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ కొనసాగించాయి.

ఈ సందర్భంగా డాక్టర్‌ సుద్దీర్‌ దారా మాట్లాడుతూ ప్రజల తరఫున, నిరుద్యోగుల తరఫున శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కాలని చూస్తే అంగీకరించబోమని అన్నారు.

డీఎస్సీపై సమగ్ర విచారణ జరపాలి

అనంతరం మీడియాతో మాట్లాడిన డాక్టర్‌ సుద్దీర్‌ దారా, బుడ్డా శేషిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.

స్పోర్ట్స్‌ కోటా పేరుతో అవకతవకలు జరిగాయని ఆరోపించిన వారు, దీనిపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల, నిరుద్యోగుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

పోలీసుల నోటీసులను లెక్కచేయకుండా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించడంతో నందికొట్కూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.