వీఎంసీ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి..

  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సింగ్‌నగర్‌ టీడీపీ సెంట్రల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సింగ్‌నగర్‌ బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికలు అక్టోబర్‌ లేదా నవంబర్‌లో జరిగే అవకాశం ఉందని, నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి డివిజన్‌లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాబోయే ఎన్నికల్లో ఓటర్ల జాబితా అత్యంత కీలకమని పేర్కొన్న బొండా ఉమా.. ప్రతి డివిజన్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని సూచించారు.

మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయా, చిరునామాలు మారిన వారి వివరాలు సక్రమంగా ఉన్నాయా, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉందా, పొరపాటున ఎవరి ఓటైనా తొలగించారా అనే అంశాలను పరిశీలించాలని తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్స్‌ అండ్‌ అదర్‌ కన్స్‌ట్రక్షన్స్‌ వర్కర్స్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ గొట్టుముక్కల రఘురామరాజు, సెంట్రల్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్‌, మాజీ కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి, ముప్పా వెంకటేశ్వరరావు, పైడి తులసి, దాసరి కనకరావు, బెజ్జం జయపాల్‌, నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్‌చార్జులు, డివిజన్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.