వైసీపీ ఎమ్మెల్సీపై జనసేన నేతల ఫిర్యాదు
తిరుపతి, ఆంధ్రప్రభ: వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో నేతలు ఫిర్యాదు అందజేశారు.
నెల్లూరులో డీఎస్సీ అభ్యర్థుల పేరుతో నిర్వహిస్తున్న దీక్షలో శ్రీవారి భక్తి గీతాన్ని అవహేళన చేసేలా వ్యవహరించారని జనసేన నేతలు ఆరోపించారు. శ్రీవారి నామాల పాటను పేరడీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తక్షణమే స్పందించాలని జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఈ ఘటనలో పాల్గొన్న ఇతర నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.
కిరణ్ రాయల్ వెంట జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, హేమకుమార్ కిషోర్, మనోజ్, సాయిదేవ్, సాయి, పురుషోత్తం, ఆది తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
