చైనాలో తుపాను బీభత్సం.. భారత్ పై ప్రభావం.!
- కోటి మందికిపైగా తరలింపు!
బీజింగ్, ఆంధ్రప్రభ : చైనాను ఈ ఏడాది అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన డాల్ఫిన్ తుఫాన్ భారీ విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పు చైనాలోని పలు ప్రాంతాలను తుపాను వణికిస్తుండటంతో 10 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆర్థిక రాజధాని షాంఘైతో పాటు జెజియాంగ్, ఫుజియాన్, జియాంగ్సు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఫిలిప్పీన్స్‌లో 8 మంది మృతి
చైనాకు చేరకముందే డాల్ఫిన్ ఫిలిప్పీన్స్, ఉత్తర తైవాన్, జపాన్‌లోని ఒకినావాపై తీవ్ర ప్రభావం చూపింది. ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు, రుతుపవనాల ప్రభావంతో 8 మంది మృతి చెందినట్లు అక్కడి పౌర రక్షణ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 7 వేల మందికిపైగా ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జపాన్‌లోని ఒకినావాలో బలమైన గాలుల కారణంగా ఐదుగురు వృద్ధులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు గాలుల ధాటికి కిందపడటంతో గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు
షాంఘైలో రవాణా స్తంభనం..
ఆదివారం సాయంత్రం జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యుహువాన్ వద్ద డాల్ఫిన్ తుపాన్ తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం గంట వ్యవధిలోనే వెన్జౌ నగరం సమీపంలో మరోసారి తీరాన్ని తాకింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తుపాను ప్రభావంతో షాంఘైలో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా దాదాపు వెయ్యి విమానాలను రద్దు చేశారు. రైలు, రోడ్డు రవాణాపైనా ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. డిస్నీల్యాండ్, లెగోల్యాండ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు, షాంఘైలోని ‘బండ్’ (Bund) ప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్స్ కూడా అధికారులు మూసివేశారు. ఇక, జెజియాంగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో 250 నుంచి 500 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం మరింత పెరిగింది.
9 లక్షల మందిని తరలించిన వెన్జౌ…
వెన్జౌలోనే సుమారు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వెయ్యికి పైగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. తైజౌ నగరంలోనూ సుమారు 3.90 లక్షల మందిని ఇళ్ల నుంచి తరలించారు. హాంగ్జౌలో తుపాను నుంచి రక్షణ కోసం వాహనాలతో బయటకు వచ్చిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని బహిరంగ పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ రుసుమును మినహాయించారు.
తీరప్రాంత ప్రావిన్స్ ఫుజియాన్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. డజన్ల కొద్దీ ప్రయాణికుల ఫెర్రీ సర్వీసులను నిలిపివేశారు. సముద్రంలో కొనసాగుతున్న 100కు పైగా నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డాల్ఫిన్ తుపాను తీరాన్ని తాకే ముందు సుమారు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ తెలిపింది. సాధారణ టైఫూన్లతో పోలిస్తే దీని ప్రభావ కాలం కూడా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత్‌పైనా ప్రభావం!
చైనాను వణికిస్తున్న డాల్ఫిన్ తుఫాన్ ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్‌పై కూడా పడుతోంది. డాల్ఫిన్ ప్రభావంతో భారత రుతుపవనాలపై తాత్కాలిక మార్పులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ స్థాయిలో బలపడిన డాల్ఫిన్ తుఫాన్ వాతావరణంలో ఒక ప్రత్యేక పరిస్థితిని సృష్టిస్తోంది.
దీనిని శాస్త్రవేత్తలు “పోటీ ప్రభావం”గా పేర్కొంటున్నారు. సాధారణంగా బంగాళాఖాతం నుంచి ఏర్పడే వర్ష వ్యవస్థలకు అవసరమైన వేడి, తేమను ఈ తుపాను తనవైపు ఆకర్షిస్తోంది. దీంతో బంగాళాఖాతంలో ఏర్పడాల్సిన వర్ష మేఘాల అభివృద్ధి ప్రక్రియ తాత్కాలికంగా మందగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, హాంకాంగ్‌లోనూ తుపాను ప్రభావంతో అసాధారణంగా అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం అక్కడ 36.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ పరిశీలనా కేంద్రం తెలిపింది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో సాధారణంగా మే నుంచి అక్టోబర్ వరకు తుపాన్ల సీజన్ కొనసాగుతుంది. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తుపాన్లు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మధ్య, ఉత్తర భారతంలో పొడి వాతావరణం!..
‘డాల్ఫిన్’ తుఫాను తీవ్రత కారణంగా భారత రుతుపవనాల సాధారణ గమనంలో స్వల్ప అంతరాయం కలగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్య, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతంలో స్వల్ప విరామం ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే, తుఫాను బలహీనపడిన తర్వాత లేదా తన గమనాన్ని మార్చుకున్న తర్వాత రుతుపవనాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని వారు స్పష్టం చేశారు.
‘డాల్ఫిన్’ పేరు ఎలా వచ్చింది?
అట్లాంటిక్ ప్రాంతంలో తుపాన్లకు సాధారణంగా మనుషుల పేర్లు పెడతారు. కానీ పశ్చిమ ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో మాత్రం భిన్నమైన విధానం ఉంది. ఈ ప్రాంతంలోని 14 దేశాలు, ప్రాంతాలు తమ సంస్కృతి, మొక్కలు, జంతువులకు సంబంధించిన పేర్లను సూచిస్తాయి. డాల్ఫిన్ అనే పేరును హాంకాంగ్ సూచించింది.
హాంకాంగ్ సముద్ర జలాల్లో కనిపించే చైనా తెల్ల డాల్ఫిన్లకు గౌరవంగా ఈ పేరును ఎంపిక చేశారు. ఆ ప్రాంతానికి అధికారిక చిహ్నంగా కూడా ఈ డాల్ఫిన్లు గుర్తింపు పొందాయి. ఒక సముద్ర జీవికి గౌరవంగా పెట్టిన పేరు.. ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న శక్తివంతమైన తుపానుగా మారింది.
