సెలవు రోజుల్లోనే మట్టి మాఫియా దందా?
పాల్వంచ ఆంధ్రప్రభ: పాల్వంచ మండలంలోని పాండురంగాపురం గ్రామపంచాయతీ పరిధి నర్సంపేట గుట్టల్లో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీబీలతో గుట్టలను తవ్వుతూ, పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి లోడ్లు తరలుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. “అధికారులతో ఇబ్బందుల్లేవు.. పాత్రికేయులే అడ్డుగా ఉన్నారు” అంటూ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న కొందరు ధీమాగా వ్యాఖ్యానిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అనుమతులు ఉన్నాయా?
నర్సంపేట గుట్టల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే మట్టి తరలిస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తూ సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సెలవు రోజుల్లో దందా?
సెలవు రోజులను అనుకూలంగా చేసుకుని మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే సెలవు రోజుల్లోనే తవ్వకాలు, రవాణా ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
మట్టి తవ్వకాలపై అధికారులు నిఘా పెంచి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నర్సంపేట గుట్టల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
